తెదేపా గల్ఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఎన్నారై తెదేపా- కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.......

Published : 28 May 2022 19:26 IST

కువైట్‌: తెదేపా వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఎన్నారై తెదేపా- కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2008లో చంద్రబాబునాయుడును తొలిసారి కలిసి కువైట్‌లో పార్టీని ప్రారంభించిన సీనియర్ నాయకుడు వెంకట్ కోడూరి ఈ వేడుకలకు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బొర్రా, ఎన్నారై తెదేపా కువైట్ మైనారిటీ విభాగం కమిటీ సభ్యులు, ఎన్నారై తెదేపా గల్ఫ్ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు, ఎన్టీఆర్- పరిటాల ట్రస్ట్, చంద్రన్న సేవా సమితి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా, నందమూరి అభిమానులంతా కలిసి ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు.  కేక్‌ కట్‌ చేసి.. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఈ ఏడాది మొత్తం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేయాలని తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా గౌరవ అతిథి వెంకట్ కోడూరి మాట్లాడుతూ.. ‘‘అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. తెలుగు జాతి అభ్యున్నతికి చంద్రబాబు ఏ విధంగా కష్టపడి పని చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, శాంతి భద్రతలు విషయంలో విఫలమవ్వడంతో రాష్ట్రంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయ కుట్రల వల్ల వ్యవస్థలు ఏరకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నాం. ప్రజలంతా అప్రమత్తమై రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శత జయంతి ఉత్సవాలు 2023 మే 28 వరకు జరుగుతాయి గనక జూన్ 10న ఓ కార్యక్రమం చేసేందుకు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను ఆహ్వానించాం. వారి సమయాన్ని బట్టి కువైట్‌లో తెదేపా అభిమానులు, కార్యకర్తల కోసం కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నాం’’ అని కువైట్‌లో ఉన్న కార్యకర్తలకు ఆయన తెలియజేశారు. 

అనంతరం ఎన్నారై తెదేపా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ముస్తాక్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మైనార్టీ హక్కులు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని ఎన్నారై టీడీపీ గల్ఫ్ నేత శంకర్ సూచించారు. ఆ రోజు చంద్రబాబునాయుడు రాయలసీమ కోసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ఇంతవరకు కూడా పురోగతి లేదని ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ సెల్‌ నేత ఓలేటి రెడ్డయ్య చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలా రెడ్డయ్య, విజయ్ కుమార్ చౌదరి, ఖదీర్ బాషా, గౌహర్ అలీ, నారాయణమ్మ, అంజలి, అంజనా రెడ్డి , నిర్మలమ్మ, కరీముల్లా, బాబ్జీ, అస్లం, మహుమ్మద్ అలీ, మనోహర్, మహుమ్మద్, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ శత జయంతి వేడుకలను ఎన్నారై తెదేపా సెల్‌ కువైట్‌ నేతలు ఓలేటి రెడ్డి, షేక్‌ ఎండీ అర్షద్‌ సమన్వయం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని