కొవిడ్‌ సామగ్రి దగ్ధంపై ‘తానా’ స్పందన

విశాఖలోని ఓ గోదాములో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో తాము వితరణగా అందించిన కొవిడ్‌ సామగ్రి బుగ్గిపాలు అవ్వడంపై  తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) విచారం వ్యక్తంచేసింది.

Updated : 05 Jun 2022 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖలోని ఓ గోదాములో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో తాము వితరణగా అందించిన కొవిడ్‌ సామగ్రి బుగ్గిపాలు కావడంపై తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) విచారం వ్యక్తంచేసింది. ప్రజా సేవ కోసం ఉద్దేశించిన సామగ్రి దగ్ధమవ్వడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ ఘటనలో వాస్తవాలు తెలియకుండా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

కరోనా సంబంధిత సహాయ సామగ్రిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అందించేందుకు తానా 2021 జూన్‌లో శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నార్త్‌ వెస్ట్‌ మెడికల్స్‌ (చికాగో) సాయంతో కొనుగోలు చేసిన ఈ సామగ్రిని హపగ్ లాయిడ్ సంస్థ ద్వారా సముద్ర మార్గంలో తెలుగు రాష్ట్రాలకు చేరవేసేందుకు ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కొన్ని అవాంతరాల తర్వాత చికాగోలోని గోదాముల నుంచి అక్టోబర్‌లో విశాఖ పంపించామని పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత అవి 2022 జనవరిలో విశాఖ పోర్టుకు చేరాయని వివరించారు. పోర్టులో స్థలాభావం కారణంగా కొన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చిందని, తర్వాత కస్టమ్స్‌ క్లియరెన్సు కోసం మరికొంత సమయం పట్టిందని తెలిపారు. ఈ సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేందుకు రెడ్‌క్రాస్‌తో మార్చిలో అవగాహన కుదిరిందని వివరించారు. 

ఈ క్రమంలో ఏప్రిల్‌లో సంభవించిన తుపాను కూడా ఈ కార్యక్రమానికి కొంత ఆటంకం కలిగించిందని వారిరువురు పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో సామగ్రి పంపిణీకి ప్రణాళిక రూపొందించి రెడ్‌ క్రాస్‌కు ఆ సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. దీంతో షిప్పింగ్‌ యార్డ్‌ నుంచి విశాఖ గాజువాకలోని శ్రావణ్‌ షిప్పింగ్‌ సంస్థకు సామగ్రిని తరలించినట్లు పేర్కొన్నారు. జూన్‌ రెండో వారంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ గవర్నర్‌ చేతులమీదుగా ప్రారంభించేందుకు తలపెట్టగా, జూన్‌ 1న ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. తానా సభ్యులు, నాయకత్వం ఎంతో కష్టపడి సేకరించిన కొవిడ్‌ సామగ్రి ఇలా అగ్నికి ఆహుతవ్వడం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. మంటల్లో కాలిపోయిన సహాయ సామగ్రికి సంబంధించి ఇన్సూరెన్స్‌ విషయమై రెడ్‌క్రాస్‌తో చర్చిస్తున్నామని తెలిపారు. ఎంతో గొప్ప ఉద్దేశంతో తానా తలపెట్టిన ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరమని, కానీ ఇవేమీ తెలీకుండా కొందరు అవాస్తవాలు ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తానా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వడానికైనా తానా సిద్ధంగా ఉంటుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని