ప్రవాసులకు పదవీ విరమణలో తోడుగా

మెరుగైన అవకాశాల కోసం ఎంతోమంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఆర్జించిన మొత్తంలో కొంత స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Updated : 02 Sep 2022 07:11 IST

మెరుగైన అవకాశాల కోసం ఎంతోమంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఆర్జించిన మొత్తంలో కొంత స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పదవీ విరమణ తర్వాత అవసరాలకు ఉపయోగపడేలా మదుపు చేసేందుకు అనువైన పథకాల కోసం చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) అనువైన పథకాలేమిటో తెలుసుకుందామా..

భారత్‌లో పదవీ విరమణ పథకాల్లో మదుపు చేయాలనే ఎన్‌ఆర్‌ఐలు వైవిధ్యమైన పెట్టుబడుల జాబితా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రాబడి హామీ పాలసీలు, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు, పెట్టుబడి హామీ పథకాలు, యాన్యుటీ ప్లాన్లు ఉండాలి. వీటన్నింటి గురించీ ముందుగానే కొంత పరిశోధించాలి. వాటికి సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. భారత ఆర్థిక వృద్ధిలో మీరూ పాలు పంచుకోవాలి. అదే సమయంలో మీ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడినివ్వాలి. అందుకే, సరైన పథకంలో సరైన పద్ధతిలో మదుపు చేయడం ఎంతో ముఖ్యం.

రాబడి హామీతో.. 

విదేశాల్లో ఉండే భారతీయులకు రాబడి హామీతో (గ్యారంటీడ్‌ రిటర్న్‌) పాలసీలు అనుకూలంగా ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా కాస్త అధిక రాబడిని ఆర్జించడంతోపాటు, బీమా రక్షణా కలిసి ఉండటం వీటి ప్రత్యేకత. పాలసీ తీసుకునేటప్పుడే గడువు తీరిన తర్వాత ఎంత మొత్తం వస్తుందనేది ముందే తెలుస్తుంది. ఎన్‌ఆర్‌ఐలు ఈ పాలసీని 45 ఏళ్ల వ్యవధి వరకూ తీసుకునే వీలుంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక పెట్టుబడికి అవకాశం లభిస్తుంది. పైగా ఈ పాలసీ వ్యవధి తీరిన తర్వాత లేదా పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నెలనెలా లేదా మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం డబ్బును ఒకేసారి తీసుకునే వీలూ ఉంటుంది. ఈ వెసులుబాటు వల్ల పాలసీదారుడికి మరింత ఆర్థిక రక్షణ లభిస్తుందని చెప్పొచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అంటే.. పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహం, ఇంటి రుణం చెల్లింపు తదితర అవసరాలకూ డబ్బును వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పాలసీ నుంచి వచ్చిన మొత్తం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10 (10డి) ప్రకారం మినహాయింపు పరిధిలోకి వస్తుంది. 18-60 ఏళ్ల మధ్య ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కేవైసీ నిబంధనలను పూర్తి చేసి, ఈ పాలసీలను తీసుకోవచ్చు. నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) ఖాతాలున్నవారు జీఎస్‌టీ రిఫండును క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అదనపు ప్రయోజనం చేకూర్చే అంశం.

బీమా.. మదుపు.. 

ఎన్‌ఆర్‌ఐలు బీమా, పెట్టుబడి రెండూ ఒకే చోట కావాలని అనుకున్నప్పుడు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌) పరిశీలించవచ్చు. చెల్లించిన ప్రీమియంలో కొంత బీమా రక్షణకు, మిగతాది స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు మళ్లిస్తారు. బీమా రక్షణ పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. విదేశాల్లో ఉంటున్న వారు.. భారతీయ స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా చూడొచ్చు. స్థిర ఆదాయ పథకాలకన్నా వీటిలో మంచి రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం మదుపు చేసినప్పుడు, మంచి సంపదను సృష్టించేందుకూ వీలవుతుంది. మార్కెట్‌ పనితీరును బట్టి, ఫండ్లను మార్చుకునే వీలూ ఉంటుంది. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం కల్పిస్తారు. క్రమానుగతంగా పెట్టుబడి పెట్టేందుకు యులిప్‌లు ఒక మంచి అవకాశంగా చూడొచ్చు. ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు కేవైసీ నిబంధనల మేరకు అవసరమైన పత్రాలు సమర్పించాలి. బీమా సంస్థతో సంప్రదించి, నిర్ణయం తీసుకోండి.

పెట్టుబడికి రక్షణ.. 

పెట్టుబడికి హామీ ఉండే పథకాలు గ్యారంటీడ్‌ రిటర్న్‌, యులిప్‌ల మిశ్రమంగా ఉంటాయి. సాధారణంగా ఈ పథకాలు 50-60 శాతం వరకూ డెట్‌లోనూ, మిగతా మొత్తాన్ని ఈక్విటీ పథకాల్లోనూ మదుపు చేస్తాయి. దీనివల్ల డెట్‌ పథకాల్లో ఉండే రక్షణ, ఈక్విటీల్లో లభించే రాబడిని అందుకునే వీలుంటుంది. పాలసీకి చెల్లించిన ప్రీమియానికి ఈ క్యాపిటల్‌ గ్యారంటీ పథకాలు 100 శాతం హామీనిస్తాయి. తొలిసారి పెట్టుబడి పెట్టే ఎన్‌ఆర్‌ఐలు ఈ పాలసీలను చూడొచ్చు.

వీటితోపాటు.. పింఛను ఇచ్చే యాన్యుటీ పాలసీలనూ ఎంచుకోవచ్చు. వీటిలో ఒకేసారి మదుపు చేసి, నెలనెలా, మూడు నెలలు, ఏడాదికోసారి పింఛను రూపంలో డబ్బును వెనక్కి వస్తుంది. ఇందులోనూ రెండు రకాల పాలసీలుంటాయి. దీర్ఘకాలం మదుపు చేసి, నిర్ణీత వ్యవధి తర్వాత పింఛను ఇచ్చేవి, వెంటనే పింఛను ఇచ్చేవి. మీ వీలును బట్టి, పాలసీలను ఎంచుకోవచ్చు. నష్టభయం భరించలేని ఎన్‌ఆర్‌ఐలు ఈ పాలసీలను పరిశీలించవచ్చు.

- వివేక్‌ జైన్‌, హెడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, పాలసీబజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని