కెనడా కాల్గరీలో శ్రీ అనఘా దత్త సొసైటీలో ఘనంగా గణపతి నవరాత్రులు

కెనడాలోని కాల్గరీ నగరంలో శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయి బాబా మందిరం)లో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాతలు

Published : 06 Sep 2022 19:51 IST

కాల్గరీ: కెనడాలోని కాల్గరీ నగరంలో శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయి బాబా మందిరం)లో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాతలు లలిత, శైలేష్, ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ ఎంతో మంది వాలంటీర్లతో గణనాథుడి వేడుకల్ని వైభవంగా జరుపుతున్నారు. గణపతి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం కాల్గరీ డౌన్‌ టౌన్‌ వీధిలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ వేడుకకు దాదాపు 400 మందికి పైగా భక్తులు పాల్గొని.. మేళతాళాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామస్మరణలతో హోరెత్తించారు. ఈ వేడుకకు కెనడా పార్లమెంట్‌ సభ్యుడు జస్రాజ్ హల్లాన్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎంపీకి, వాలంటీర్లకు శైలేష్‌ భాగవతుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులకు మహా నైవేద్యం అందజేశారు.

గత ఐదేళ్లుగా విఘ్నేశ్వరుడికి సంప్రదాయబద్ధంగా పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. వేద పారాయణం, నిత్య అగ్నిహోత్రం, పూజలు, యాగాల వల్ల ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కఠోర వ్యాధులు ప్రబలకుండా భగవంతుడు కాపాడాలని వేడుకున్నారు. సర్వేజనా సుఖినోభవంతు, దైవ స్మరణలతో దాదాపు 800 మంది భక్తుల ఆలయ సందర్శనతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సత్కార్యానికి కెనడా కాల్గరీ, ఎడ్మంటన్‌, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు తరలిరావడం విశేషం. అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ అనేది షిర్డీ సాయిబాబా, అనంత పద్మనాభస్వామి, అనఘా దేవి, శివుడు, హనుమంతుడు, గణేశుడు, కార్తికేయలను కలిగి ఉన్న ఆలయాన్ని నిర్వహించే ఓ స్వచ్ఛంద సంస్థ. ఆలయంతో పాటు శాస్త్రీయ సంగీతం, నృత్య కార్యక్రమాలతో సహా వివిధ సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలకు సైతం ఈ సంస్థ ప్రోత్సాహమిస్తుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు