బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ రూ.10లక్షల విరాళం

జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు

Published : 17 Sep 2022 20:57 IST

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ వరుసగా మూడో ఏడాది రూ.10 లక్షల విరాళం అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి శనివారం అందజేశారు. అనాథ విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్టు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ఛైర్మన్‌ పొట్లూరి రవి తెలిపారు. లాభపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యనందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందిస్తామని, ఈ కార్యక్రమానికి తోడ్పాటునందిస్తోన్న పలువురు ఎన్నారైలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

ఓర్వకల్లు పొదుపుసంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపు సంఘం మహిళలను అభినందిస్తున్నట్టు సునీత తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్తులో కూడా బాలభారతి పాఠశాలకు వస్తుంటానని, తనవంతు సహకారం అందిస్తానని సునీత తెలిపారు. ప్రవాసుల సేవానిరతిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ స్ఫూర్తితో ఎన్‌ఆర్‌ఐలు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 

బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిథులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారం మరువలేనిదని విజయభారతి కొనియాడారు. స్వయం కృషితో ఎదిగిన సునీత లాంటి కళాకారులు అందరికీ ఆదర్శమని, మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలభారతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్లమెంట్‌ సత్యంబాబు, సందడి మధు, పొదుపు మహిళా సంఘం ఛైర్మన్‌ విజయలక్ష్మి, కార్యదర్శి తాజునిష, కోశాధికారి విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి పద్మావతమ్మ, పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు