US Green card: అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు!

అమెరికాలో శాశ్వత నివాసం హోదా కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. గ్రీన్‌కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా చట్టసభలో డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే డ్రీమర్లు, హెచ్‌-1బీ,

Updated : 30 Sep 2022 07:26 IST

 పాత నిబంధనల్ని మార్చేలా సెనేట్‌లో కీలక బిల్లు

ఆమోదం లభిస్తే భారతీయులకు భారీ ఉపశమనం

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం హోదా కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. గ్రీన్‌కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా చట్టసభలో డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే డ్రీమర్లు, హెచ్‌-1బీ, దీర్ఘకాల వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు భారీ ఊరట లభిస్తుంది. కనీసం ఏడేళ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా పొందటానికి అర్హులవుతారు. ఈ బిల్లును సెనేటర్‌ అలెక్స్‌ పాడిల్లా సభలో ప్రవేశపెట్టగా.. ఎలిజిబెత్‌ వారెన్‌, బెన్‌ రే లుజన్‌, డిక్‌ డర్బిన్‌ బలపరిచారు.  వలసదారులు కనీసం ఏడేళ్లు అమెరికాలో నివసిస్తే.. గ్రీన్‌కార్డు జారీ చేయాలని ఈ బిల్లులో సెనేటర్లు ప్రతిపాదించారు. ‘పాత ఇమిగ్రేషన్‌ విధానం ద్వారా లక్షల మంది వలసదారులు నష్టపోయారు. వీరందరూ దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తూ దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధిలో సహకరిస్తున్నారు. అయినా వారికి స్వేచ్ఛగా యూఎస్‌లో జీవించే హక్కును కల్పించకపోవడం వల్ల దేశం కూడా నష్టపోతోంది. వీరందరికీ గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తే మరింత మంది వలసదారులు చట్టబద్ధమైన నివాస హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే బిల్లును ప్రవేశపెట్టామ’ని సెనేటర్‌ అలెక్స్‌ పాడిల్లా తెలిపారు.  గ్రీన్‌కార్డు పొందిన వారు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. హెచ్‌-1బీ వీసాలపై ఆ దేశానికి వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా బిల్లు ఆమోదం పొందితే వలసదారుల గ్రీన్‌కార్డు కష్టాలు తీరిపోతాయి.


వచ్చే నెల రెండో వారంలో ఎఫ్‌-1 వీసా స్లాట్లు

 అమెరికా మినిస్టర్‌  కాన్సులర్‌ డాన్‌ హెఫ్లిన్‌

‘విద్యార్థి వీసాల కోసం అమెరికా ద్వారాలు తెరుస్తోంది. వచ్చే స్ప్రింగ్‌ సీజనులో అమెరికా విద్యాసంస్థలలో చేరేవారి కోసం రెండు దశల్లో భారీగా ఎఫ్‌-1 వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. అక్టోబరు రెండో వారంలో కొన్ని, నవంబరు రెండో వారంలో మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను పరిశీలించండి. కానీ రోజు మొత్తంలో రెండు మూడు సార్లకు మించి చూస్తే మీ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్‌ కాన్సులర్‌ డాన్‌ హెఫ్లిన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా గురువారం ప్రకటించారు. ‘ఒక దఫా తిరస్కరించిన విద్యార్థి వీసా దరఖాస్తులను గత సీజనులో నియంత్రించాం. చివరి దశలో వారి దరఖాస్తులనూ అనుమతించాం. ఈ దఫా కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. కరోనాతో వీసా జారీలో ఇబ్బందులొచ్చాయి. భారత్‌లో మా కార్యాలయాలు ప్రస్తుతం 70 శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల చర్చల తరువాత అదనపు సిబ్బందిని భారత్‌కు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది’ అని హెఫ్లిన్‌ తెలిపారు. ‘హెచ్‌, ఎల్‌ విభాగాల్లో వచ్చే నెల లక్ష వీసా స్లాట్లు విడుదల చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దరఖాస్తులనూ అనుమతించలేం. ఉన్నతస్థాయి కార్యనిర్వాహక అధికారులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు, అమెరికా కంపెనీలతో కీలక వ్యాపారం నిర్వహిస్తున్నవారు.. ఇలా పరిమిత సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంది. ఎవరెవరు అర్హులన్న సమాచారం వెబ్‌సైట్‌లో ఉంది’ అని డాన్‌ హెఫ్లిన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని