జగన్‌ పాలనను అంతమొందించాలి.. ఎన్నారైల సమావేశంలో మారెడ్డి శ్రీనివాసులు

జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం కన్నీరు కారుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ కడప అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.

Updated : 14 Nov 2022 16:47 IST

కేన్సాస్‌: జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం కన్నీరు కారుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ కడప అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కేన్సాస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్నారై యూఎస్ కో-ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన జరిగింది. తొలుత ఎన్టీఆర్ మనవరాలు మనస్విని కంభంపాటి, లక్ష్మీ నాయుడు వెలకటూరితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారెడ్డి శ్రీనివాసులురెడ్డి, మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఆంధ్ర రాష్ట్రం కంట తడి పెడుతోందన్నారు. దీనిపై ప్రవాసాంధ్రులు స్పందించాలని, తక్షణమే ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబును సీఎంను చేసేందుకు అందరం నడుం బిగించాలని చెప్పారు. విధ్వంస పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆర్థికంగా అథఃపాతాళంలోకి వెళ్లిందని అన్నారు. జగన్ ఆర్థికంగా పరిపుష్టి చెంది.. రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని మండిపడ్డారు. ప్రతి కార్యక్రమానికీ తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకునే ఉత్సాహం.. అభివృద్ధిలో మాత్రం లేదని విమర్శించారు. చివరకు శ్మశానాలకు కూడా తండ్రి పేరు పెట్టుకుంటారేమో అని ఎద్దేవాచేశారు.  జయరాం కోమటి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అని, దాన్ని త్వరగా వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి కేసుల నుంచి బయట పడటానికి ప్రధాని కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి ఉన్నంత కాలం ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండబోవన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఎవరికీ రక్షణలేని పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు, నేరస్థులు కలిసి పనిచేస్తున్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపైన, జగన్మోహన్ రెడ్డిపైన సొంత చెల్లెలే విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయమనడమే దీనికి నిదర్శనమన్నారు. నేరస్థుల పాలనలో అరాచకం ప్రబలిపోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ మనవరాలు మనస్విని కంభంపాటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా క్రమశిక్షణతో జీవించారని, అలాంటి వారికి మనవరాలిగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, లక్ష్మీ నాయుడు వెలకటూరి, కేన్సాస్ స్టేట్ ఎన్ఆర్ ప్రెసిడెంట్ రావు ద్రోణవల్లి, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కొమ్మినేని, జనరల్ సెక్రటరీ వెంకట్ నల్లూరి, ట్రెజరర్ గౌతమ్ నల్లూరి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవల్లిక వట్టెం, యూత్ కో ఆర్డినేటర్ రతన్ కొమ్మినేనితో పాటు దాదాపు 400 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్ర గన్నే, జితేంద్ర చలసాని, రూప బసు, హేమంత్ వట్టెం, ప్రకాష్ కన్యధార, బాపు మోతే, కృష్ణ రెలేటర్, అరవింద్ పుట్టి, కార్యకర్తలందరికీ కేన్సాస్ స్టేట్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ రావు.. ద్రోణవల్లి ధన్యవాదాలు తెలిపారు. నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని వెంకట్ గొర్రెపాటి, హెల్త్‌ యూనివర్సిటీకి తిరిగి రామారావు పేరు పెట్టాలని సత్య చిగురుపాటి తీర్మానాలు చేశారు. అందరూ వీటికి ఆమోదం తెలిపారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts