NRI: యూనివర్సిటీ ఆఫ్‌ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గ్రంథాలయం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో యూనివర్సిటీ ఆఫ్‌ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

Published : 28 Mar 2023 22:43 IST

మిల్పిటాస్‌: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో యూనివర్సిటీ ఆఫ్‌ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన జీవితంలో సమకూర్చుకున్న వేల పుస్తకాలను యూనివర్సిటీకి వితరణగా సమర్పించారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని భారత కాన్సులేట్ జనరల్ ప్రారంభించారు. 

తొలుత సిలికానాంధ్ర కార్యవర్గం..లక్ష్మీప్రసాద్‌, సౌజన్య దంపతులను గుర్రపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి తీసుకురాగా.. వేదాశీర్వచనాలతో పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా గ్రంథాలయ భవనంలోకి తీసుకొచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి కూచిభొట్ల ఆనంద్‌, చీఫ్‌ అకడమిక్‌ ఆఫీసర్‌ చామర్తి రాజు, భారత కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ టీవీ నాగేంద్రప్రసాద్‌, మిల్పిటాస్‌ నగర వైస్‌ మేయర్‌ ఎవిలిన్‌ చూ తదితరులు వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాన్సుల్‌ జనరల్‌ ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులోనే కాక హిందీలో కూడా పీహెచ్‌డీ పట్టా పొందిన యార్లగడ్డ సాహిత్య ప్రతిభను కొనియడారు. సిలికానాంధ్ర ప్రస్తుత, పూర్వ అధ్యక్షులు, ప్రస్తు కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ దంపతులను ఘనంగా సత్కరించి.. ‘సిలికానాంధ్ర గ్రంథ పయోనిధి’ బిరుదుతోపాటు సన్మాన పత్రాన్ని అందించారు. యార్లగడ్డ తన జీవిత కాలంలో సేకరించిన 14వేల పుస్తకాలను యూనివర్సిటీ లైబ్రరీకి బహూకరించారు. వారి ఇద్దరు పిల్లలు యూనివర్సిటీకి చెరో $20,000 విరాళాన్ని కూడా ప్రకటించారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల.. యార్లగడ్డతో తన అనుబంధాన్ని గుర్తుచేశారు. సాహిత్యం, రాజకీయం రెండింటినీ తమ ఒరలో అలవోకగా అమర్చుకున్న అరుదైన వ్యక్తి అని అభివర్ణించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుస్తకాలన్నిటినీ ఏం చెయ్యాలో పాలుపోక గత కొద్దికాలంగా మదనపడుతున్నానని, చివరకు సిలికానాంధ్ర యూనివర్సిటీ వాటికి సరైన చోటని నిర్ణయించుకున్నానని చెప్పారు. లైబ్రరీ ఏర్పాటుకు యూనివర్సిటీ యంత్రాంగం ఆమోదించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భారత సంప్రదాయంలో కవికి తాను రాసిన పుస్తకం కుమార్తెతో సమానమని, తండ్రిగా తను తగిన ఇంటికే వాటిని పంపుతున్నానన్న నమ్మకంతోనే యూనివర్సిటీకి ఇస్తున్నానని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని