లండన్‌లో ఎన్టీఆర్‌, కోడెల శివప్రసాద్‌ జయంతి వేడుకలు

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి, ఆయన మానస పుత్రుడు డాక్టర్ కోడెల శివప్రసాద్‌ 75వ జయంతిని పురస్కరించుకొని, ‘ఎన్నారై యూకే తెదేపా’ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇరువురి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 19 May 2023 14:19 IST

లండన్‌: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు, దివంగత తెదేపా నేత డాక్టర్ కోడెల శివప్రసాద్‌ల జయంతి వేడుకలను ‘ఎన్నారై యూకే తెదేపా’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరామ్‌ మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు శత జయంతి, కోడెల శివప్రసాద్ జయంతి, మదర్స్ డే అన్నీ మే నెలలో కలిసి రావడం చూస్తుంటే ఒక త్రివేణి సంగమంలా ఉంది అని అభివర్ణించారు. ‘ఎన్టీఆర్‌ అంటే ఒక భావోద్వేగం, ఆయన మార్గదర్శకుడు, ప్రజానాయకుడు’ అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే  నిజమైన గౌరవం దక్కుతుందని తెలిపారు. చంద్రబాబునాయుడికి, తన నాన్న కోడెల శివప్రసాద్‌కు చాలా మంచి అనుబంధం ఉందని చెప్పారు. చంద్రబాబు ఏదైనా పని అప్పగిస్తే అది పూర్తయ్యే చేసేవరకూ తన తండ్రి నిద్రపోయేవారు కాదని చెప్పారు. గతంలో పంచాయతీరాజ్, వైద్య విద్య, ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖలను శివప్రసాద్‌ ఎంతో నిబద్ధతగా నిర్వర్తించారని వివరించారు. లోకేష్‌ ఏపీ కోసం కష్టపడుతూ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. 

గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో కుటుంబాలు వెన్నెముకగా నిలిచాయని శివరామ్‌ అన్నారు. అందులో కోడెల కుటుంబం, పరిటాల, అయ్యన, అశోక్ గజపతి రాజు, యనమల కుటుంబం ఉన్నాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా విజయానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జయకుమార్(ఎన్నారై యూకే తెదేపా రీజినల్ కౌన్సిలర్ మెంబర్), శ్రీనివాస్ పాలగుడు(జనరల్ సెక్రటరీ), సురేశ్‌ కోరం, సుందర్‌, ప్రసన్న నాదెండ్ల, నరేశ్‌, శ్రీనివాస్, రానా ప్రతాప్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని