డాక్టర్‌ కృష్ణ ఎల్ల దంపతులకు తానా జీవితకాల సాఫల్య పురస్కారం

కొవిడ్‌-19 మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌ టీకా ఆవిష్కర్తలైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది.

Published : 28 Jun 2023 06:20 IST

‘కొవాగ్జిన్‌’ ఆవిష్కరణకు దక్కిన గౌరవం
7, 8, 9 తేదీల్లో ఫిలడెల్ఫియాలో 23వ మహాసభలు

ఫిలడెల్ఫియా: కొవిడ్‌-19 మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌ టీకా ఆవిష్కర్తలైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నటుడు మురళీమోహన్‌కు తానా ఎన్టీఆర్‌ సాంస్కృతిక పురస్కారాన్ని అందించనున్నారు. కళారంగంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందిస్తున్నట్లు తానా నిర్వాహకులు పేర్కొన్నారు. తానా 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. మహాసభల నిర్వహణ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు తానా పలు అవార్డులను ప్రకటించింది. అమెరికాలో ఉండే తెలుగువారికి సేవలు అందిస్తోన్న శ్రీరంగనాథబాబు గొర్రెపాటికి తానా ఫౌండేషన్‌ పురస్కారాన్ని అందించనున్నారు. ఏపీలోని ఘంటసాలకు చెందిన శ్రీరంగనాథబాబు.. అమెరికాకు వలస వచ్చిన తొలితరం తెలుగువారిలో ఒకరు. తెలుగుభాషకు విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే గిడుగు రామమూర్తి అవార్డును.. మనసు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డా.మన్నం వెంకటరాయుడికి ఇవ్వనున్నట్లు తానా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని