ఘనంగా తానా మహాసభల ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

Updated : 09 Jul 2023 06:49 IST

ఈనాడు, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా పలువురు ప్రముఖులకు తానా ఎక్స్‌లెన్స్‌ అవార్డులను అందించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణను తానా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. తానా మెరిటోరియస్‌ అవార్డులను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అందించారు. భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల ఈ సందర్భంగా యువతకు దిశానిర్దేశం చేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌లో యువశక్తి అధికంగా ఉందని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించారు. చిత్ర, సింహ, కౌసల్య ఆలపించిన సినీగీతాలు అలరించాయి. కాప్రికో బ్యాండ్‌ లైవ్‌ మ్యూజిక్‌ అందరినీ ఉత్సాహంలో ముంచెత్తింది. తానా అధ్యక్షుడు  అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ రవి పొట్లూరి, ఛైర్మన్‌ శ్రీనివాస్‌ లావు ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సినీనటుడు రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ఎమ్మెల్యే సీతక్క, హీరోయిన్‌ శ్రీలీల తదితరులు హాజరయ్యారు. శనివారం రెండో రోజు కార్యక్రమాల సందర్భంగా ప్రదర్శించిన.. ‘తెలుగుకి తందాన తానా, తరతరాల తానా’ నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.


తానా అధ్యక్షుడిగా నిరంజన్‌ శృంగవరపు ప్రమాణ స్వీకారం నేడు

ఆళ్లగడ్డ, శిరివెళ్ల, న్యూస్‌టుడే: తానా అధ్యక్షుడిగా ఎన్నికైన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం రాజనగరం గ్రామానికి చెందిన నిరంజన్‌ శృంగవరపు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే మూడేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. తానాకు అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్నికవడం గర్వకారణమని పలువురు కొనియాడుతున్నారు. నిరంజన్‌ జిల్లాలోనూ సేవలు కొనసాగిస్తున్నారు. మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నంద్యాల, శిరివెళ్ల ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలో ముగ్గురు చొప్పున పేద మహిళలను గుర్తించి కుట్టుమిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారు. కొవిడ్‌ ప్రారంభ దశలో లక్షల మాస్కులను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. 500 వెంటిలేటర్లను అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని