NRI Marriages: ఎన్నారై పెళ్లిళ్లు.. ఎన్నెన్నో మోసాలు!

విదేశాల్లో ఉంటున్న అబ్బాయిల గురించి సరిగా విచారణ చేయకుండా పెళ్లిళ్లు చేయడం తగదని అనేక అనుభవాలు రుజువుచేస్తున్నాయి. ఎన్నారై వివాహాలకు సంబంధించి పలు మోసాలు బయటపడుతున్నాయి.

Updated : 10 Jul 2023 07:48 IST

గుజరాత్‌, పంజాబ్‌, తెలంగాణల్లో అధికం
జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడి
41 నెలల్లో 313 మంది పెళ్లికొడుకులపై ఫిర్యాదులు

ఈనాడు, హైదరాబాద్‌ : విదేశాల్లో ఉంటున్న అబ్బాయిల గురించి సరిగా విచారణ చేయకుండా పెళ్లిళ్లు చేయడం తగదని అనేక అనుభవాలు రుజువుచేస్తున్నాయి. ఎన్నారై వివాహాలకు సంబంధించి పలు మోసాలు బయటపడుతున్నాయి. చదువుకోసం అమెరికా, ఆస్ట్రేలియా, జర్మన్‌, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళుతున్న అబ్బాయిల్లో కొందరు అక్కడ అనేక ఇతర వ్యాపకాలు పెట్టుకుంటున్నారు. కొన్ని దేశాల్లో చదువుకునే అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో ఉండటం సాధారణం. దాంతో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు. కొందరు పెళ్లి కూడా చేసుకుని ఆ విషయం భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు చెప్పడం లేదు.మరోవైపు విదేశీ సంబంధం చేస్తే తమ అమ్మాయి బాగా స్థిరపడుతుందని వధువు తల్లిదండ్రులూ ముందుకొస్తున్నారు. కానీ ఆ తరవాత అసలు విషయం తెలిసి హతాశులవుతున్నారు. కొందరు అబ్బాయిలు విదేశాల్లో స్థిరపడలేక ఇబ్బందులు పడుతూ అక్కడి యువతులతో సహజీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిని తల్లిదండ్రులు ఇక్కడికి పిలిపించి.. బలవంతంగా పెళ్లికి ఒప్పించి ఇక్కడ యువతి జీవితాన్ని నాశనం చేస్తున్నారని పలు మ్యారేజి బ్యూరోల వారు చెప్పారు. 

ఈ మూడు రాష్ట్రాల్లోనే...

గుజరాత్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఎన్నారై సంబంధాలు చేసుకుని మోసపోతున్నారని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖాశర్మ చెప్పారు. ‘ఎన్నారైని పెళ్లి చేసుకోవడంలో సమస్యలు’ అనే అంశంపై గుజరాత్‌లోని వడోదరలో ఒక యూనివర్సిటీలో కమిషన్‌ ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై ఈ పెళ్లిళ్లలో జరుగుతున్న మోసాల గురించి చెబుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నారై సంబంధం చేయాలనుకునే తల్లిదండ్రులు ముందుగా అబ్బాయి వివరాలు కావాలని అతను ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాయవచ్చని ఆమె సూచించారు.


పెరుగుతున్న కేసులు

ఎన్నారైని పెళ్లి చేసుకుని మోసపోయిన బాధిత మహిళలు రాష్ట్ర ప్రభుత్వ మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదులిస్తున్నారు. 2019 ఆగస్టు నుంచి 2022 డిసెంబరు వరకూ 313 ఫిర్యాదులందినట్లు ఈ విభాగం తెలిపింది. 2022లోనే 85 మంది అమ్మాయిలు ఎన్నారై పెళ్లితో వేధింపులకు గురవుతున్నట్లు కేసులు పెట్టారు.


బాధితులు వేలమంది...

* హరియాణా, పంజాబ్‌లలో 32 వేల మందికి పైగా అమ్మాయిలు కొన్నేళ్లుగా ఎన్నారైలను పెళ్లి చేసుకుని మోసపోయారు. వారిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఎన్నారై పెళ్లికొడుకుల పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలంటూ పాసుపోర్టు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులతో ఈ లెక్క తేలింది.

* పంజాబ్‌ లూధియానాలో ఎన్నారైని పెళ్లి చేసుకుని మోసపోయిన యువతి తనలాగా ఎవరూ నష్టపోకూడదని ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అందరిలో చైతన్యం తెస్తోంది. ఈ సంస్థకు ఇప్పటికే 700 మంది మోసపోయిన అమ్మాయిలు ఫిర్యాదు చేశారు.

* అమెరికాలో ఎమ్మెస్‌ చేసి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిల్లో ఎక్కువ మంది ఇండియాలో ఉన్న అమ్మాయిలనే చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. వారి బాగోతాలు ఇక్కడున్న వారికి తెలియవనే గుడ్డి నమ్మకమే ఇందుకు ప్రధాన కారణమని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వివరించారు.


అమెరికాలో ఉన్నాడని పెళ్లి చేయబోతే...

ఆ అబ్బాయిది వరంగల్‌ జిల్లాలో ఓ కుగ్రామం. ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ బాగా సెటిల్‌ అయ్యాడని ఇక్కడ తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అమ్మాయి ఎంటెక్‌ పాసై హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. మంచి ముహూర్తాలు లేక పెళ్లి కొంతకాలం వాయిదా పడింది. ఈలోగా అమ్మాయికి కంపెనీ తరపున మూడు నెలల పాటు అమెరికాలో పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఆ విషయం అబ్బాయికి చెప్పకుండా ఆమె సర్‌ప్రైజ్‌ చేయాలనుకుని వెళ్లింది. తీరా అక్కడిక వెళ్లిచూస్తే ఆమె గుండె చెరువైంది. అతనికి అక్కడ ఉద్యోగం ఏమీ లేదు. ఒక హోటల్‌లో సర్వర్‌గా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని కళ్లారా చూసిన ఆ యువతి పెళ్లి రద్దుచేసుకుంది.


డబ్బు తీసుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌కు చెందిన ఒక యువకుడు బీటెక్‌ పూర్తిచేసి 2016లో ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ డాలస్‌లో పుట్టి పెరిగిన ఒక యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఆ విషయం ఇక్కడ ఎవరికీ చెప్పలేదు. మళ్లీ ఇండియాలో పెళ్లి చేసుకోవాలని బోగస్‌ వివరాలను మ్యారేజ్‌ బ్యూరోలో ఇచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి కుటుంబం అతని పెళ్లి బయోడేటా చూసి ముచ్చటపడి పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. కొంతకాలం సోషల్‌ మీడియాలో మాట్లాడుకున్న తరవాత పెళ్లికి ముందు తన తల్లికి అత్యవసర చికిత్స కోసం డబ్బు కావాలని రూ.6.75 లక్షలు ఆ అమ్మాయి నుంచి తీసుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఆ తరవాత అతను స్పందించకపోవడంతో అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అతని బోగస్‌ వివరాలు, డాలస్‌లో ముందే పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది.


ఆస్తులు, సాక్ష్యాలు కాపాడుకోండి...

ఎన్నారైని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తను గుడ్డిగా నమ్మి విదేశాలకు వెళ్లి మోసపోతున్నారు. భర్త మోసం చేశాడని లేదా వేధించాడని ఫిర్యాదు చేసేవారు పక్కా సాక్ష్యాలు కొన్నయినా ఇవ్వగలిగితేనే వారికి న్యాయం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు సాక్ష్యాలు సేకరించడం లేదు. పెళ్లి కాగానే ఇండియాలో ఉన్న ఆభరణాలు, ఆస్తులు లేదా విదేశంలో సంపాదించిన వాటిని భర్త లేదా అత్త, మామలకు అప్పగించి వారి పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. భర్త వల్ల మోసపోయి విడిపోయాకనే వారి ఆస్తులు కూడా పోయాయని గుర్తించి బాధపడుతున్నారు. భర్త ఎంత మంచివాడనిపించినా ఆస్తులు మాత్రం అమ్మాయి పేరుపై.. లేదా ఇద్దరి పేర్లపై ఉండేలా చూసుకుంటే భవిష్యత్తులో ఏదైనా కష్టమొస్తే ఆర్థికంగా అండ ఉంటుంది.  భర్తతో కలసి కాపురానికి వెళ్లగానే అక్కడి చట్టాలు తెలుసుకోవాలి. ఉద్యోగం చేస్తూ అందుకవసరమైన వీసా పొందాలి. ఇండియాలో పెళ్లి చేసుకుని అమెరికాలో కొందరు అబ్బాయిలు విడాకులు ఇస్తున్నారు. అలా చెల్లదు. మనదగ్గర పెళ్లి చేసుకుంటే ఇక్కడ విడాకులిస్తేనే చెల్లుతాయి.

సుమతి, డీఐజీ, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం


ఫోన్‌ నంబర్లు తీసుకుని విచారణ చేయండి

ఇద్దరి కుటుంబాలు, ఆస్తులు, చదువులు, ఉద్యోగం, జాతకం వంటి వివరాల గురించే ఎక్కువగా విచారిస్తూ పెళ్లి కుదుర్చుకుంటున్నారు. వధూవరులు ఇతరులతో సహజీవనం చేస్తున్నారా? మరొకరితో ప్రేమలో ఉన్నారా? అనేది పరిశీలించడం లేదు. ఏ యూనివర్సిటీలో చదివాడు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఏ వీసాపై ఉన్నాడు? అతని స్నేహితులెవరు?  అనే వివరాలు తెలుసుకుని విచారణ చేయాలి. అమెరికాలో సహజీవనం లేదా పెళ్లి చేసుకునే తెలుగు అబ్బాయిలు ఇండియాలో ఎవరికైనా తెలుస్తుందేమోనని అమెరికాలో చుట్టుపక్కల నివసించే తెలుగువారితో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ఎవరితో కలవకుండా రిజర్వుడుగా ఉంటున్నారంటే అనుమానించాలి.

జె.శ్రీహరిబాబు, షికాగో, అమెరికా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని