కుల అహంకార ఆలోచనలతో సమాజ విచ్ఛిన్నం

మానసిక స్థితి సరిగా లేనివారే జాత్యహంకార, కుల అహంకార ఆలోచనలు చేస్తారని.. వాటిని వ్యాపింపజేస్తారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు.

Updated : 11 Jul 2023 12:36 IST

మానసిక స్థితి సరిగాలేని వారే ఇలాంటివి చేస్తుంటారు
ప్రైౖవేట్‌ సంస్థలకు పార్టీల నిర్వహణ, ఎన్నికల ప్రచార బాధ్యతలా?
ఇది రాజకీయాల్లో వికృత ధోరణి
తానా మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, అమరావతి: మానసిక స్థితి సరిగా లేనివారే జాత్యహంకార, కుల అహంకార ఆలోచనలు చేస్తారని.. వాటిని వ్యాపింపజేస్తారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు. అలాంటి వారే సమాజ విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారన్నారు. నేను, నా కుటుంబం అనే ఆలోచన తప్ప వారికి ఇంకేమీ పట్టవు.. కానీ చేసేదంతా సమాజం కోసమే అని నమ్మబలుకుతారని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో  పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో నిర్వహిస్తున్న 23వ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహాసభల్లో ఆదివారం ఆయన తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘అమెరికాలోని భారతీయులు కష్టజీవులని, నిజాయతీపరులని.. కానీ వారిలో ఐక్యత లేదని, కలహించుకుంటారని ఇటీవల ఒక దౌత్యవేత్త చెప్పడంతో నా మనసు చివుక్కుమంది’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘భారతదేశంలో.. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కులవివక్ష తగ్గుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు పెరుగుతున్నాయి. కానీ ప్రగతిశీల అమెరికా సమాజంలో నివసించే భారతీయ సంతతి వారిలో పాతకాలపు కులపోకడలు ఇప్పటికీ ఉన్నాయని విని ఎంతో బాధపడ్డాను. నేను, నా సామాజిక నేపథ్యం మాత్రమే ఉన్నతం. మిగతా అందరూ అథములేనన్న ఆలోచనలు బలంగా ఉన్నవారికి చరిత్ర ఏ పాఠాలు నేర్పిందో గుర్తు చేసుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రపంచం గుణపాఠాలు నేర్చుకునేలోపే ఎంతో విధ్వంసం, మారణహోమం జరిగాయి. ఇంత చదువులు చదివి, ఇంతింత అనుభవం గడించిన తర్వాత కూడా మనం ఇలాంటి ప్రచారాలను నమ్మి, వినాశనానికి ఊతమిస్తున్నామంటే.. రాబోయే తరాలు మనల్ని క్షమించవు’ అని స్పష్టం చేశారు.

ప్రజలతో సంబంధం లేనివారికి రాజకీయాలు ఏం తెలుస్తాయి? 

రాజకీయ పార్టీల నిర్వహణ, ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని.. ప్రపంచ రాజకీయాల్లో ఇదొక వికృత ధోరణిగా తయారైందని జస్టిస్‌ రమణ చెప్పారు. ‘ప్రజలతో సంబంధం లేనివారు.. ఎన్ని ఎంబీఏ, ఐటీ డిగ్రీలున్నా పార్టీ ఎలా నడుపుతారో నాకు మాత్రం అంతుపట్టడం లేదు. రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. నిజాయతీపరుల్ని, నీతిమంతుల్ని, చెడును ప్రశ్నించే ధైర్యం కలిగిన వారిని రాజకీయాలు ఆకర్షించలేకపోవడమే దీనికి కారణం. కళాశాల స్థాయిలో విద్యార్థుల్ని రాజకీయాలకు దూరం చేయడం ఇందుకు ముఖ్య కారణమని నా అనుభవం చెబుతోంది. మా తరం వరకు నాయకులు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చేవారు. ప్రజల్లో నుంచి వచ్చే నాయకులే ప్రజా సమస్యలకు తగిన విధంగా స్పందించి, సమాజానికి మార్గం చూపగలుగుతారు’ అని చెప్పారు.

నీతిలేని వారే రాజ్యమేలితే నష్టం

యువత, విద్యార్థులు, మేధావుల్ని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విజ్ఞప్తి చేశారు. ‘పలాయనవాదం పనికిరాదు. నీతి, నిజాయతీ కలిగిన వారు రాజకీయాల్లోకి రాకపోతే.. నీతి లేని వారే రాజ్యమేలుతారు. వారు చేసే నష్టం పూడ్చటానికి దశాబ్దాలు పడుతుంది’ అని హెచ్చరించారు. ‘గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం - జగమంతా ఒక నిలయం’ అనే గుర్రం జాషువా మాటల స్పూర్తితో తెలుగువారంతా ప్రగతిశీల భాగస్వాములుగా ఘనకీర్తి సాధించాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా దేశ చరిత్రలో సామాజిక విప్లవానికి నాంది పలికిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు తెలుగువాళ్లు విశ్రమించకూడదన్నారు.

నాటి ఏపీ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో.. అమెరికాలో ఆంధ్రులకు అవకాశాలు

దార్శనికుడైన నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంతో అమెరికాలో ఆంధ్రులకు అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వివరించారు. ‘అమెరికాలోని భారతీయ సంతతిలో 14% తెలుగువారే అని ఒక అంచనా. గడచిన దశాబ్దంలో 86% పెరిగిందట. గతేడాది భారత్‌ నుంచి 1.90లక్షల మంది ఉన్నత చదువుల కోసం అమెరికాకు రాగా.. అందులో 20% నుంచి 25% తెలుగు వారే అని అంచనా’ అని పేర్కొన్నారు.

తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు పెంచండి

‘మీరంతా ప్రపంచాన్ని చూశారు. అగ్రరాజ్యంలో, అత్యాధునిక జీవనశైలితో ప్రగతిశీల సమాజంలో నివసిస్తున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగారు. నీతి నిజాయతీ నిండిన ఘనమైన సంప్రదాయాలతో ఈ దేశంలో కాలు మోపారు. మన మంచిని నలుగురికీ పంచండి. తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలు పెంచండి’ అని దిశానిర్దేశం చేశారు. ‘తెలుగువారు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి. సమీప భవిష్యత్తులో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలను తెలుగువారే స్థాపించి, నడిపించాలనేది నా కోరిక. ఉద్యోగాలు ఆశించడం కాదు, సృష్టించే స్థాయికి ఎదగాలి. అమెరికాలో తెలుగు వారికి నాలుగైదు తరాలు గడిచాయి. ఇక చురుగ్గా ప్రజాజీవితంలో ప్రవేశించాలి. పాలనలో, విధానాల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. ఒక తెలుగు వ్యక్తి అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యే రోజు ఎంతో దూరం లేదని నా నమ్మకం’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

తెలుగు నేర్చుకోవడానికి ప్రపంచం పోటీపడే రోజు వస్తుంది

అమెరికాలో అన్నింటికంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగే అని.. రాబోయే రోజుల్లో పెరగనున్న తెలుగువారి ప్రాభవానికి ఇది సంకేతమని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ‘మనం ఆర్థికంగా ఎదిగే రోజు ఎంతో దూరం లేదు. తెలుగు నేర్చుకోవడానికి ప్రపంచం పోటీ పడే రోజులు వస్తాయి’ అని అభిలషించారు. ‘మాతృభాష.. ఏ భాషకూ తీసిపోదు. ఇంగ్లిషు సర్వరోగ నివారిణి అని నమ్మించే ప్రయత్నాలు పదే పదే జరుగుతూనే ఉంటాయి. మన వెనుకబాటుతనానికి తెలుగే కారణమని చెప్పే వాళ్లూ ఉంటారు. అంతకు మించిన అసత్యం మరోటి ఉండదు. అభ్యాసానికి మాతృభాషలో వేసిన పునాదే పటిష్ఠంగా ఉంటుందని శాస్త్ర పరిశోధనల్లో రుజువైంది. భాష అనేది మన చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు ప్రతీక’ అని చెప్పారు.  


భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్ర వేశారు

జస్టిస్‌ ఎన్‌.వి.రమణపై న్యూజెర్సీ సెనేట్‌, జనరల్‌ అసెంబ్లీల సంయుక్త తీర్మానం

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేసిన కృషిని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్‌, జనరల్‌ అసెంబ్లీ ప్రశంసించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా ఆయన అనేక సంస్కరణలను అమలు చేశారని ప్రశంసిస్తూ ఉమ్మడిగా తీర్మానపత్రం విడుదల చేశాయి. ‘జస్టిస్‌ రమణ కీలకమైన కేసుల్లో సమర్థవంతంగా తీర్పులు వెలువరించారు. కోర్టుల్లో న్యాయ నియామకాలను పెంచడంతో పాటు.. పెండింగ్‌ కేసులకు వేగవంత పరిష్కారం చూపడంలో విశేష కృషి చేశారు’ అని కీర్తించాయి. ‘భారత న్యాయవ్యవస్థపై జస్టిస్‌ రమణ చెరగని ముద్ర వేశారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీడియా కవరేజిని విస్తృతం చేశారు. ఆయన అసాధారణ దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. ప్రజాజీవితంలోని వారందరికీ మార్గదర్శకులు’ అని కొనియాడాయి. జస్టిస్‌ రమణ సేవ, నాయకత్వాన్ని అభినందిస్తూ తీర్మానించాయి. సెనేటర్‌ డైగ్నాన్‌, అసెంబ్లీ సభ్యుడు కరాబిన్‌చయాక్‌, స్టాన్లీ తీర్మానం ప్రవేశపెట్టగా.. సంయుక్త తీర్మానపత్రంపై సెనేట్‌ ప్రెసిడెంట్‌ నికోలస్‌ పి.స్కూటరి, జనరల్‌ అసెంబ్లీ స్పీకర్‌ క్రెయిగ్‌ జె.కాగ్లెన్‌ సంతకాలు చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు