సందడిగా ముగిసిన తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఆదివారం సందడిగా ముగిశాయి. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో మూడో రోజు పలువురు ప్రముఖులను సత్కరించారు.

Updated : 11 Jul 2023 07:40 IST

భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌   ఛైర్మన్‌ కృష్ణ ఎల్లకు డాక్టర్‌ కాకర్ల అవార్డు ప్రదానం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఆదివారం సందడిగా ముగిశాయి. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో మూడో రోజు పలువురు ప్రముఖులను సత్కరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను సన్మానించిన తానా ప్రతినిధులు.. ఆయన సేవలను గుర్తిస్తూ న్యూజెర్సీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అందించారు. ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించి, తెలుగు జాతికి విశేష సేవ చేసిన వారికి అందించే ‘తానా డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌’ అవార్డును భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లకు అందజేశారు. ‘మేం రూపొందించిన తొలి వ్యాక్సిన్‌ను అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా విడుదల చేసినప్పుడు.. తానా నాయకులు కాకర్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన పేరుతో ఇచ్చే అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం’ అని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ తయారీలో కృష్ణ ఎల్ల చేసిన కృషిని అభినందిస్తూ న్యూజెర్సీ జనరల్‌ అసెంబ్లీ, సెనేట్‌ సంయుక్తంగా చేసిన తీర్మానాన్ని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి ఆయనకు అందించారు. తానా ఎన్టీఆర్‌ అవార్డును సినీ నటుడు మురళీమోహన్‌ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. బాలకృష్ణ దంపతుల్ని సత్కరించిన తానా ప్రతినిధులు తమ కార్యవర్గం, ట్రస్టు తరఫున.. బసవ తారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల వివరాలతో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావులు రూపొందించిన సావనీర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవిష్కరించారు. మహాసభల చివరిరోజున నటుడు నిఖిల్‌, నటి శ్రీలీల తదితరులు మాట్లాడారు. తానా నూతన అధ్యక్షునిగా నిరంజన్‌ శృంగవరపు ప్రమాణస్వీకారం చేశారు.

పిడికెడు ఆత్మగౌరవం కోసం

తానా మహాసభల్లో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ అనే నినాదం ప్రతిధ్వనించింది. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బహుజన ఐకాస ప్రత్యేక స్టాల్‌ వద్ద.. ప్రజా రాజధాని అమరావతి మహిళల పోరాట చిత్రాలతోపాటు డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అచ్చెన్న, డ్రైవర్‌ సుబ్రమణ్యం తదితరుల ఫొటోలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాష్టీకాలను, దళితుల స్థితిగతుల్ని ప్రపంచంలోని తెలుగు ప్రజలకు చాటిచెప్పాలనే మహాసభల్లో ‘మాకు ఊపిరి ఆడటం లేదు’ అంటున్న దళితుల గొంతుక వినిపించామని ఆత్మగౌరవ సమితి గౌరవ సలహాదారులు యలమంచిలి ప్రసాద్‌ (చికాగో) పేర్కొన్నారు. వైకాపా నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు, దౌర్జన్యాలపై ఏపీ ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సారథ్యంలో జరుగుతున్న దళితుల ఉద్యమానికి ఎన్నారైలు మద్దతు పలికారని వివరించారు.

* భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల సంస్కరణలు - విధి విధానాలు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.


వకుళాభరణం కృష్ణమోహన్‌కు మహాత్మా ఫులే పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: తానా మహాసభల్లో  సామాజిక న్యాయ కోణంలో బహుజన వాదంపై సమాలోచనలు నిర్వహించడం గొప్పగా ఉందని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. మహాసభలకు ఆత్మీయ అతిథిగా హాజరైన ఆయనకు తానా.. మహాత్మా ఫులే పురస్కారాన్ని అందజేసింది. తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడు పసాద్‌ తోటకూర చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.  ఈ సభలు తెలుగు జాతి ఔన్నత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించాయని వకుళాభరణం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని