అంతర్జాతీయ అతిపెద్ద ఎన్‌ఆర్‌ఐ సంస్థగా తానా

అంతర్జాతీయంగా అతిపెద్ద ఎన్‌ఆర్‌ఐ తెలుగు సంస్థగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నిలిచిందని, 72 వేల మంది జీవితకాల సభ్యులతో ఈ ఘనత సాధించిందని తానా పూర్వ అధ్యక్షుడు(2021-23) అంజయ్య చౌదరి లావు తెలిపారు.

Updated : 26 Jul 2023 06:26 IST

పూర్వ అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు

ఈనాడు, అమరావతి: అంతర్జాతీయంగా అతిపెద్ద ఎన్‌ఆర్‌ఐ తెలుగు సంస్థగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నిలిచిందని, 72 వేల మంది జీవితకాల సభ్యులతో ఈ ఘనత సాధించిందని తానా పూర్వ అధ్యక్షుడు(2021-23) అంజయ్య చౌదరి లావు తెలిపారు. ‘తానాలో 44 ఏళ్లలో 36 వేల మంది సభ్యులుగా చేరగా... గత రెండేళ్లలో 36 వేల మందిని చేర్చాం. తానా ఫౌండేషన్‌ కార్యక్రమాలకు 10 వేల డాలర్ల చొప్పున విరాళంగా ఇచ్చిన దాతలు గతంలో 62 మంది ఉండగా... కొత్తగా 132 మంది చేరారు. జీవితకాల సభ్యులు, శాశ్వత ఫౌండేషన్‌ డోనర్ల ద్వారా 4 మిలియన్‌ డాలర్ల ఆదాయం తానాకు సమకూరింది’ అని ఆయన వివరించారు. తానా అధ్యక్షుడిగా రెండేళ్ల కాలంలో అమలు చేసిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ‘‘రెండేళ్లలో 80కిపైగా నేత్ర వైద్య శిబిరాల్ని నిర్వహించాం. కొవిడ్‌ సమయంలో 100 క్యాన్సర్‌ క్యాంపులను విజయవంతంగా పూర్తిచేశాం. ‘చేయూత’ కింద భారతదేశం, అమెరికాలో 1,800 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాం. ‘తోడ్పాటు’లో దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, బాలికలకు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ‘అన్నపూర్ణ’ ద్వారా విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోజుకు 600 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. ఐదేళ్ల లోపు మూగ చిన్నారులకు ప్రభుత్వ సహకారంతో శస్త్రచికిత్సలు చేయించాం’ అని అంజయ్యచౌదరి తెలిపారు.

40 రోజుల పాటు 110 కార్యక్రమాలు

‘ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో భాగంగా శాశ్వత గ్రంథాలయాలు, కమ్యూనిటీ కేంద్రాలు, డిజిటల్‌ తరగతి గదులు, మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేశాం. చైతన్య స్రవంతి కింద కళలు, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ 40 రోజుల పాటు 110 కార్యక్రమాలు నిర్వహించాం. వివిధ కారణాలతో మృతి చెందిన వారి మృతదేహాలను తానా టీం స్క్వేర్‌ ద్వారా స్వదేశానికి చేర్చేందుకు సహకారం అందించాం. వీసా సంబంధిత సమస్యల పరిష్కారంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచాం. తానా కేర్స్‌ కింద 35 వేసవి శిబిరాలను నిర్వహించాం. ఇమిగ్రేషన్‌కు సంబంధించి సెమినార్లు, వీలునామాపై అవగాహన కార్యక్రమాల్ని చేపట్టాం. మహిళా ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన దిశగా వెబినార్లు పెట్టాం’ అని వివరించారు. ‘తానా పాఠశాల కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో అమ్మభాషలో శిక్షణ ఇచ్చి, తెలుగు భాషా పరిరక్షణకు కృషిచేశాం. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుని... ఏటా సుమారు 500 మంది బాలికలకు సంగీత శిక్షణ ద్వారా డిప్లొమా చేసే అవకాశం కల్పించాం. న్యూయార్క్‌ నడిబొడ్డున టైంస్క్వేర్‌లో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాం’ అని చెప్పారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అంజయ్య చౌదరి వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు