US Visa Slots: విద్యార్థులకు అమెరికా తీపి కబురు!

ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకునే ఆశావహులకు అమెరికా తీపికబురు చెప్పింది. వీసాలకు సంబంధించి ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం కల్పించింది.

Updated : 13 Aug 2023 07:44 IST

వీసాలకు మరోసారి అవకాశం
దిల్లీ, చెన్నై, కోల్‌కతాలలో స్లాట్ల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకునే ఆశావహులకు అమెరికా తీపికబురు చెప్పింది. వీసాలకు సంబంధించి ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఫాల్‌ సీజనుకు సంబంధించి విద్యాసంస్థలు తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం ఉన్నత విద్యకోసం అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆనందానికి లోనుచేస్తోంది. ఇప్పటివరకు వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. దిల్లీ రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, చెన్నై, కోల్‌కతాలలోని కాన్సులేట్ల పరిధిలో ఈ స్లాట్లు విడుదల చేశారు. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో మాత్రమే స్లాట్లు విడుదలవకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఫాల్‌ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు పెద్దసంఖ్యలో వీసాలు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే భారీగా వీసాలు జారీ చేసింది.

ప్రస్తుత విద్యాసంవత్సరం చివరిదశకు చేరిన నేపథ్యంలో తాజాగా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసింది. దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. ఒకసారి ఇంటర్వ్యూలో వీసా లభించని విద్యార్థులు రెండు నెలలుగా వాటికోసం నిరీక్షిస్తున్నారు. తొలిసారి ఇంటర్వ్యూలో వీసా ఆమోదం పొందకపోయినప్పటికీ తక్షణమే మరోదఫా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు గతంలో అవకాశం ఉండేది. అయితే, ఒక విద్యాసంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రెండోసారి ఇంటర్వ్యూకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా స్లాట్లు జారీ చేస్తుండటంతో వారికి మరో అవకాశం కలిగినట్లయింది. ఈ నెల చివరి వారం వరకు తాజా స్లాట్లు అందుబాటులో ఉంటాయి. 

పర్యాటక వీసాదారుల నిరీక్షణ

పర్యాటక వీసాల(బి1/బి2)ల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఎదురుచూపులు తప్పటం లేదు. తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం ఎంతోమంది గత కొన్నినెలలుగా వేచి చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్వల్పసంఖ్యలో స్లాట్లు విడుదల చేసినా.. 2024 సంవత్సరంలోనే ఇంటర్వ్యూ తేదీలు లభిస్తున్నాయి. విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తయిన తరవాత పర్యాటక వీసా స్లాట్లు విడుదల చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. పలు సాంకేతిక సమస్యలతో వీసా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు