Study in America: ‘వీస’మెత్తు తేడా వచ్చినా..

కోరుకున్న విద్యాసంస్థలో సీటు, వీసా వచ్చిందన్న ఆనందంతో ఎగిరి గంతేస్తూ అమెరికా పయనమవుతున్న భారతీయ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు షాక్‌ ఇస్తున్నారు.

Updated : 19 Aug 2023 08:37 IST

వీసా ఉన్నా అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా ఉండలేరు..
సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్‌లు, ధ్రువీకరణ పత్రాల్లో తేడాలుంటే అంతే
గత కొద్ది రోజులుగా 500 మంది భారతీయ విద్యార్థులు వెనక్కి
ఇమిగ్రేషన్‌ అధికారుల ప్రశ్నలకు జవాబివ్వడంలో తడబాటు వద్దు
నిపుణులు, అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాల సూచన
ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి

కోరుకున్న విద్యాసంస్థలో సీటు, వీసా వచ్చిందన్న ఆనందంతో ఎగిరి గంతేస్తూ అమెరికా పయనమవుతున్న భారతీయ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు షాక్‌ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు, బ్యాంకు ఖాతా లావాదేవీలు లాంటి అంశాలపై వారి ఛాటింగ్‌లను బట్టి కొందర్ని విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇలా దాదాపు 500 మంది భారతీయుల్ని వెనక్కి పంపించారని అంచనా. దీంతో ఆగస్టు, సెప్టెంబరు నుంచి మొదలయ్యే ఫాల్‌ సీజన్‌కు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీసా అనేది అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా ఉండేందుకు ఇస్తున్న ధ్రువపత్రం ఏమీ కాదని, విద్యార్థులు సమర్పించిన ధ్రువపత్రాలు సరైనవి కావని తేలితే ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చని నిపుణులు, అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలవారు చెబుతున్నారు.

ఆంగ్లంలో జవాబులు చెప్పలేకపోతే..

విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థుల ఎఫ్‌-1 వీసా, బోర్డింగ్‌ పాస్‌ లాంటి వాటిని ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేస్తారు. దీన్ని ‘పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ’గా పిలుస్తారు. అందర్నీ కాకున్నా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులను ఏ వర్సిటీకి వెళ్తున్నారు? ఏ కోర్సులో చేరతారు? ఎక్కడ నివాసముంటారు? లాంటి కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారు. వాటికి కూడా కొందరు ఆంగ్లంలో సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారని అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలు చెబుతున్నాయి. వెనక్కి పంపుతున్న వారిలో సగం మంది కనీస ఆంగ్ల పరిజ్ఞానం లేని వారేనంటున్నాయి. ఆంగ్లంలో సమాధానాలు చెప్పలేకపోతే.. జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ‘అందర్నీ ఇమిగ్రేషన్‌ అధికారులు ప్రశ్నించడం, తనిఖీ చేయడం వీలుకాదు. తమకు అనుమానం వచ్చిన కొందర్ని గదుల్లో కూర్చోబెట్టి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలిస్తారు. వారి ధ్రువపత్రాలు నిజమైనవేనా కాదా తెలుసుకునేందుకు ‘తప్పుడు పత్రాలే కదా’ అని బెదిరింపు ధోరణిలో అడుగుతారు. నిజం ఒప్పుకొంటే వెనక్కి పంపిస్తామని, లేకుంటే జైలుకెళ్తారని బెదిరిస్తారు’ అని కాలిఫోర్నియాలో ఎంఎస్‌ నాలుగో సెమిస్టర్‌ చదువుతున్న తెలుగు విద్యార్థి ఒకరు తెలిపారు.

అలాంటి ఛాటింగ్‌లు, పోస్టులు ఉంటే..

వాట్సప్‌లో చేసిన ఛాటింగ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఈ-మెయిళ్లు ఇప్పుడు వందల మంది విద్యార్థులకు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధంగా మారుతున్నాయి. తమకు అనుమానం వచ్చినవారిని లేదా కొందరినైనా ప్రశ్నించేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఛాటింగ్‌లను ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. ఉదాహరణకు తొలి రోజు నుంచే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేయవచ్చా? ఫీజులకు అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఎలా చూపాలి? అందుకు కన్సల్టెన్సీలకు ఎంత చెల్లించాలి? లాంటి వాటిపై స్నేహితులతో జరిపే సంభాషణలు జరిపినట్లు ఉంటే.. అలాంటి వారిని వెనక్కి పంపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. విద్వేషపూరితమైన పోస్టులు ఉంటే తీవ్రంగా పరిగణిస్తారంటున్నారు.

తప్పుడు ధ్రువపత్రాలు ఉంటే..

గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఈ ఏడాది అమెరికా విద్యకు పయనమవుతున్నారు. గత ఏడాది 1.90 లక్షల మంది వెళ్లగా.. ఈసారి తక్కువ డిమాండ్‌ ఉన్న సీజన్‌లోనే(జనవరి నుంచి జూన్‌ వరకు) 91 వేల మంది యూఎస్‌ఏలోకి అడుగుపెట్టారు. ఆగస్టు, సెప్టెంబరులో మొదలయ్యే ఫాల్‌ సీజన్‌ కోసం జులై నుంచే వెళ్తున్నారు. ఈ సంవత్సరం ఏకంగా 2.50 లక్షల నుంచి 2.70 లక్షల మంది వెళ్తారని అంచనా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తప్పుడు ధ్రువపత్రాలున్న వారిని నిరోధించేందుకు అమెరికా అధికారులు తాజాగా ఒకేసారి 21 మందిని వెనక్కి పంపినట్లు కొందరు భావిస్తున్నారు. ‘ప్రతి ఏటా కనీసం 200 మంది ఇలా ఇమిగ్రేషన్‌ తనిఖీల్లో దొరికి వెనక్కి వస్తుంటారు. ఈ సంవత్సరం ఇప్పటికే 500 మంది భారతీయులు వచ్చి ఉంటారని అంచనా. ఒకేసారి 21 మందిని వెనక్కి పంపడంతో చర్చ మొదలైంది’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకట రాఘవరెడ్డి పేర్కొన్నారు. ‘మేం సమర్పించే అన్ని ధ్రువపత్రాలు నిజమైనవేనని వీసా మంజూరు సమయంలో విద్యార్థులు ధ్రువీకరిస్తారు. వాటిలో తప్పుడు పత్రాలుంటే వారిని వెనక్కి పంపిస్తారు’ అని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు చెబుతున్నారు.

ఇవీ జాగ్రత్తలు..

అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు, అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

  • వీసా మంజూరు కోసం ఎలాంటి తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించకూడదు.
  • అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగం చేయకూడదు. అలాంటి వాటిపై ఛాటింగ్‌లు చేయకూడదు.
  • సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత, రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టకూడదు.
  • చదువుకునే వర్సిటీ, కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. చదువుకునే సమయంలో ఎక్కడ, ఎవరితో ఉంటారన్న అంశంపై స్పష్టత ఉండాలి.
  • ట్యూషన్‌ ఫీజు, ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి పొందుతారు? ఒకవేళ బ్యాంకు రుణం తీసుకుంటే.. ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవాలి.
  • ఐ-20 కోసం పూర్తిగా కన్సల్టెన్సీలపై ఆధారపడకుండా సొంతంగా వివరాలు నింపాలి. దానివల్ల విద్యార్థులకు చాలావరకు అవగాహన పెరుగుతుంది.

ర్యాండమ్‌ తనిఖీలు ఉంటాయి

అమెరికాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల్లో కొందర్ని ఇమిగ్రేషన్‌ అధికారులు ర్యాండమ్‌ తనిఖీలు చేస్తారు. ఆ సమయంలో వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోయినా, విద్యార్థుల వద్ద ఉన్న పత్రాల్లో ఏమైనా లోపాలు కనిపించినా వెనక్కి పంపిస్తారు. ఫోన్లలో ఛాటింగ్‌లు, సంక్షిప్త సందేశాలు, ల్యాప్‌టాప్‌లలోని సమాచారం, ఈ-మెయిల్స్‌ లాంటివి సైతం పరిశీలిస్తారు. బయోడేటాలో పేర్కొన్న వివరాలకు విద్యార్థి వద్ద ఉన్న పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉన్నా వెనక్కి పంపించేందుకు అవకాశం ఉంటుంది.

డాక్టర్‌ రఘు కొర్రపాటి, ప్రొఫెసర్‌, అటార్నీ, దక్షిణ కరోలినా, అమెరికా


ట్యూషన్‌ ఫీజులు చెల్లించి వెళ్లాలి

ఇమిగ్రేషన్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. ఎక్కడ ఉండబోతున్నారని అడిగితే ఇంకా ఆలోచించుకోలేదని చెబితే ఎలా? ఆ ప్రశ్నకు స్పష్టత ఉండాలి. అంతేకాకుండా ట్యూషన్‌ ఫీజులను ఇక్కడ ఉన్నప్పుడే చెల్లించి, వాటి రసీదులు కూడా తీసుకువెళ్లాలని విద్యార్థులకు చెబుతున్నాం. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు వస్తాయా? యూనివర్సిటీ మారవచ్చా? తదితర అంశాలపై కొందరు సంభాషణలు చేస్తున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

శుభకర్‌ ఆలపాటి, గ్లోబల్‌ ట్రీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని