వైల్డ్ వుడ్ నగరంలో తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ పుట్టిన రోజు

తెలుగుజాతి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ ‌పుట్టిన రోజును మిస్సోరి రాష్ట్రంలోని వైల్డ్ వుడ్ నగరంలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారు.

Updated : 20 Aug 2023 15:17 IST

అమెరికాలో తెలుగువారికి మరోసారి అరుదైన గుర్తింపు, గౌరవం లభించాయి. తెలుగుజాతి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ ‌పుట్టిన రోజును మిస్సోరి రాష్ట్రంలోని వైల్డ్ వుడ్ నగరంలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారు. అమెరికాలో తెలుగువారందరికి ఇది ఎంతో గర్వ కారణమైన విషయం. మిస్సోరి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన తీర్మానం ద్వారా తెలుగువారికి దక్కిన గౌరవం ఇది. 

వైల్డ్ వుడ్ నగరంలో తెలుగు వారు అధికంగా నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో తెలుగు వారందరు ఏకతాటిపైకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుజాతి గొప్పతనాన్ని, తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను వైల్డ్ వుడ్ నగర మేయర్‌కు, అక్కడ అధికారులకు స్పష్టంగా వివరించడంతో పాటు దానికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించారు.

తెలుగు వారి ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నగరంలో తెలుగువారి కోసం నగర మేయర్ జిమ్ బౌలిన్ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారు. మిస్సోరి రాష్ట్రంలో తెలుగువారు సాధించిన ఈ విజయం అక్కడ నివసించే తెలుగువారిలో స్ఫూర్తిని నింపుతుంది. తెలుగు హెరిటేజ్ డే అధికారిక ప్రకటన కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, గిరిధర్ (గ్యారీ)లను స్థానిక తెలుగువారంతా ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ అరుదైన గౌరవం దక్కడంపై శ్రీనివాస్ మంచికలపూడి హర్షం వ్యక్తం చేశారు. ఇది అమెరికాలో తెలుగువారందరికి లభించిన గుర్తింపు అన్నారు. తెలుగువారిలో ఎక్కువగా కష్టపడే తత్వం ఉందని వైల్డ్ వుడ్ నగర మేయర్  జిమ్ బౌలిన్ ప్రశంసించారు. తెలుగు హెరిటేజ్ డే అధికారికంగా ప్రకటించిన పత్రాన్ని తెలుగువారికి అందించారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ డైరెక్టర్ డా.సుధీర్ అట్లూరి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ బెల్లం, సందీప్ గంగవరపు, రామారావు కాజా, బాబు దండమూడి, శ్రీనివాస్ గుళ్లపల్లి, సత్య చిగురుపాటి, వేణుగోపాల్ రెడ్డి సీ, నాగశ్రీనివాస్ శిష్ట్లా, సురేశ్ శ్రీరామినేని, సురేంద్ర బాచిన, బుడ్డి విజయ్, శ్రీనివాస్ అట్లూరి, వంశీ పాతూరి, శ్రీనివాస్ కొటారు,  జగన్ వేజండ్ల, రామకృష్ణ వీరవల్లి, బుధి రాజు, డా. పంటే,  సురేంద్ర భీరపనేని, అరుణ్ కొడాలి, శ్రీనివాస్ ఐనవరపు, కృష్ణ వల్లూరు, గిరి గొట్టిపాటి, శ్రీధర్ రెడ్డి ఆవుల, శివ కృష్ణ మామిళ్లపల్లి, శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ కారుమూరి, రాధాకృష్ణ రాయని తదితరులు పాల్గొన్నారు.

స్థానికంగా నాట్స్‌తో పాటు తానా, సిలికానాంధ్ర మనబడి లాంటి సంస్థలు కూడా తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలుగు వారి ఐక్యతను చాటి చెప్పాయి. వైల్డ్ వుడ్ నగరంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు