లండన్‌లో ‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ సభ
‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ సభ లండన్‌లో సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది.
‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ సభ లండన్‌లో సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాత్రా రచయితలు తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు. యాత్రా రచయిత డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు ఇంగ్లిష్‌లో రాసిన ఈ యాత్రా కథనాలను ప్రముఖ తెలుగు సాహిత్యకారులు దాసరి అమరేంద్ర అనువాదం చేసి ప్రచురించారు. అమరేంద్ర ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా యూకే తెలుగు సాహితీ మిత్రులు ఈ సభను నిర్వహించారు.
ఇంగ్లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 60 మందికిపైగా సాహిత్య మిత్రులు ఇందులో పాల్గొన్నారు. సభానిర్వహణ సమన్వయకర్త సూర్య కిరణ్ ఇంజమ్ సభికులను ఆహ్వానిస్తూ.. ‘మూల రచయిత, అనువాదకుడు’ కలిసి విదేశంలో పాల్గొంటున్న అరుదైన సందర్భం ఇది అని చెప్పారు. వీరితో పాటు ఇతర రచయితలు, అనువాదకులు కూడా సభలో ఉండడం విశేషమన్నారు.
సభా కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ వెలగపూడి బాపూజీరావు.. దాసరి అమరేంద్ర, డాక్టర్ శేషగిరిరావు గురించి సభికులకు పరిచయం చేశారు. అమరేంద్ర అనువాదం మూల రచనలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉందన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ వెలగపూడి బాపూజీరావు పుస్తకాన్ని ఆవిష్కరించగా.. తొలి కాపీని హేమ పర్చూరి అందుకున్నారు. తన భర్త శేషగిరిరావు యాత్రలకు తమ కుమార్తెల తోడ్పాటు ఎంతో ఉందన్నారు. కుమార్తెలు మాట్లాడుతూ.. తమ తండ్రి యాత్రలు, రచనలు తమకు ఎంతో ఉత్తేజాన్నిస్తాయన్నారు.
ప్రధాన ఉపన్యాసకులు దాసరి అమరేంద్ర మాట్లాడుతూ..‘యాత్రలు మనిషిని సంస్కరిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి. ప్రకృతితో, మనుషులతో మమేకమై ప్రయాణాలు సాగుతాయి. యాత్ర రచనల్లో ఉండే వైవిధ్యం, స్వేచ్ఛా వ్యక్తీకరణ మిగతా సాహితీ ప్రక్రియల్లో ఉండదు. తెలుగులో మహిళా యాత్రికులు పెరుగుతున్నారు’ అని చెప్పారు. తొలి యాత్రాసాహిత్య పుస్తకం ఏనుగుల వీరాస్వామి రాసిన ‘కాశీ యాత్ర’ ను ఈ సందర్భంగా ఉదహరించారు. తొలి మహిళ యాత్ర రచన జానకమ్మ ఇంగ్లాడ్ యాత్రను తలచుకున్నారు. శేషగిరి రావు ఫేసుబుక్‌లో ఇంగ్లిష్‌లో రాసిన యాత్రా కథనాలు విషయ రీత్యా తనను ఆకర్షించాయని, అవి తెలుగు పాఠకులకు అందించాలనే కోరిక పుట్టించాయని చెప్పారు.
తమ ఇద్దరి ప్రయాణ తాత్వికత మనిషి, ప్రకృతితో మమేకమై, జిజ్ఞాసతో సాగుతాయని అర్థమయ్యాక తన కోరిక ఇంకా బలపడి అయన అనుమతి కోరినట్లు తెలిపారు. అనువాదంలో తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినా, అయన రచనతో అనువాదకుడిగా తను ఎదుర్కొన్న ప్రధాన సమస్య మొరాకో సాంస్కృతిక, రాజకీయ, భాషా విషయాలను అర్ధం చేసుకోవడం.. దానికోసం పరిశోధన చేశానని చెప్పారు. ఎంతో వైవిధ్యమున్న మొరాకో చారిత్రిక నేపథ్యం గొప్ప ఆసక్తిని కల్గించిందన్నారు. బానిసలంటే ఆఫ్రికన్ నల్లవారనుకునే అవగాహన తొలిగి పోయి, తెల్ల వాళ్ల్లు కూడా బానిసలుగా ఉన్నారని ఈ యాత్రా రచన ద్వారా తెలిసిందన్నారు. అలానే మూల రచన నుండి పక్కకు పోకుండా తగుమాత్రపు స్వేచ్ఛతో అనువదించడం మరో సమస్య అని పేర్కొన్నారు.
రచయిత, అనువాదకుడితో పాఠకులకు జరిగిన ముఖాముఖీ సంభాషణ ఆసక్తిగా సాగింది. అనువాదకురాలు, రచయిత జయశ్రీ అట్లూరి, నగేష్ చెన్నుపాటి, రవి దండమూడి, ఇంగ్లిష్ నవలా రచయిత హేమ మాచర్ల, రామకృష్ణలు అడిగిన ప్రశ్నలు, సమాధానాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనువాదం మూల రచనతో మమేకమై సాగిందని, రచయిత ఆత్మను పట్టించిందని చర్చలో పాల్గొన్న పాఠకులందరూ చెప్పారు.
శేషగిరిరావు నాయకత్వంలో 30 మంది పర్వతారోహకులతో ఈ నెలలో జరగబోయే హిమాలయల్లోని ‘అన్నపూర్ణ పర్వతారోహణ’కు సన్నద్ధమౌతున్నారని ఆ బృందంలోని సభ్యుడు రవి దండమూడి చెప్పారు. శేషగిరిరావు చేసిన 30 ప్రయాణాలను అనువదించే పనిలో ఉన్న జయశ్రీ అట్లూరి తన అనువాదానికి అమరేంద్ర అనువాద పద్ధతి ఉపయోగపడిందన్నారు.
ప్రశ్నలకు రచయిత శేషగిరిరావు స్పందిస్తూ తన ప్రయాణాలు ఒక లక్ష్యంతో మొదలు కావన్నారు. తన రచనా ప్రేరణకు ప్రఖ్యాత తెలుగు యాత్రికుడు, ‘భ్రమణ కాంక్ష’ రచయిత ప్రొఫెసర్ ఆదినారాయణ అన్నారు. ఆయా దేశాలలో తాను చూసిన, ప్రభావితం చేసిన విషయాలు సమగ్రమైనవని అనుకోనన్నారు. అయితే.. తోటి మానవుల్ని ఒక మూసలో చూసే అలవాటు నుంచి బయట పడేదానికి అది ఉపయోగ పడిందని చెప్పారు. ఉదాహరణకు తన అనుభవంలో ఇస్లామిక్ దేశాలలో ప్రయాణం అత్యంత సురక్షితంగా సాగిందని పేర్కొన్నారు. తన యాత్రకున్న సమయ, ఉద్దేశ పరిమితులతో.. ఆయా దేశాల మంచి చెడులు చూసి అనుభవించే అవకాశం ఉండదన్నారు. కానీ 135 దేశాల యాత్రలు చెప్పిన సారాంశం ‘మనుషులందరూ, మనందరం ఒకటే ’ అని అన్నారు. ఈ సభ నిర్వహణకు సహకరించిన సాహితీమిత్రులకు కృతఙ్ఞతలు చెప్పారు. సమన్వయ కర్త సూర్య కిరణ్ ఇంజమ్, సూర్య కందుకూరి, బి. రామానాయుడు, సభకు వచ్చిన సాహితీ మిత్రులకు, స్నేహితులు, ఆప్తులకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
సాహితీ మిత్రుల తరఫున సూర్య కందుకూరి సభను ముగిస్తూ.. సాహితి వేత్త అమరేంద్ర, రచయిత శేషగిరిరావు పాల్గొన్న ఈ సభ నిర్వహించడం సాహితీ మిత్రులకు దొరికిన గొప్ప అవకాశం అన్నారు. ఈ సభను ఆశీర్వదిస్తూ వీడియో సందేశం ఇచ్చిన గొప్ప నటులు, నాటక రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి, అల్పాహారం ఏర్పాటు చేసిన సుచిత్ర ముత్తం కుటుంబానికి, ఆడియో ఏర్పాట్లు చేసిన సాయికి, ఫోటోగ్రఫీ, వీడియో సహకారం అందించిన సృజన్ రెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్