రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు.

Updated : 01 Jul 2024 06:33 IST

పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించాలి
మేరీల్యాండ్‌లోని ప్రవాసాంధ్రుల పిలుపు 

మాట్లాడుతున్న హేమప్రసాద్‌ యడ్ల. చిత్రంలో మన్నవ సుబ్బారావు, సత్యనారాయణ మన్నె, భాస్కరరావు, రాజా

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. ఏపీలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మేరీల్యాండ్‌ సిటీలోని ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడినపెట్టడంలో ప్రవాసాంధ్రులు అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు 

‘రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యే అవకాశం మనకు లభించింది. అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి’ అని సీనియర్‌ వైద్యుడు హేమప్రసాద్‌ యడ్ల కోరారు. ప్రజాస్వామ్యంలో హంతకులకు చోటు ఉండదని ఈ ఎన్నికలు నిరూపించాయని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తెలిపారు. ‘ఈనాడు’ ద్వారా రామోజీరావు ప్రశ్నించేతత్వాన్ని బోధించారని కొనియాడారు. తెదేపా ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. ఎన్డీయే విజయంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో పొట్లూరి భాస్కర్‌రావు, శ్రీనాథ్‌రావు, శివ నెలకుదిటి, సత్యనారాయణ మన్నె తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని