అమర గాయకునికి అద్భుత నివాళి ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’

అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమం ప్రారంభమైంది

Published : 09 Dec 2021 17:26 IST

సింగపూర్‌: అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమం ప్రారంభమైంది. ‘వంగూరి ఫౌండేషన్’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శుభోదయం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఘంటసాల సతీమణి సావిత్రమ్మ శుభాశీస్సులు అందించగా, వారి కుమార్తెలు సుగుణ, శాంతి జ్యోతి ప్రకాశనం గావించి, ప్రార్థనాగీతంతో శుభారంభాన్ని పలికారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, జగన్మోహనరావు, తదితర ప్రముఖులు, ఇతర నిర్వాహకబృంద సభ్యులు పాల్గొని ఘంటసాల వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రసంగించారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ఘంటసాల స్మరణలో జరిగే కార్యక్రమంగా ఇది అంతర్జాతీయ రికార్డు సృష్టిస్తోందని అందరూ అభినందనలు వ్యక్తం చేశారు.

ఘంటసాల ట్రస్ట్, వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ ‘డిసెంబర్ 4వ తేదీ 2022 వరకు ఏడాది పాటు రోజూ గంటసేపు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని, కవులు రచయితలు వక్తలు ఘంటసాల వారిపై వ్యాసాలను కవితలను వినిపిస్తారని’ ప్రకటించారు. ఎంతోమంది గాయనీ గాయకులను ఆదరించిన ఘంటసాల పాటకు సమున్నతస్థానం కల్పిస్తూ కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తాము నిర్మించిన ‘ఘంటసాల స్మృతి మందిరం’ గురించిన వివరాలను తెలియజేసి అక్కడ జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వీడియో రూపంలో అందరికీ చూపించారు.

రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చంద్రతేజ, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, తాతా బాలకామేశ్వరరావు, కె విద్యాసాగర్ చక్కటి గీతాలను పద్యాలను ఆలపించి ప్రేక్షకులను మెప్పించగా, సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈలపై, 20కు పైగా ఘంటసాల పాటల పల్లవుల పల్లకిని పలికించి అందరినీ ఆకట్టుకున్నారు. జీవి రామకృష్ణ సౌజన్యంతో చౌటపల్లి, టేకుపల్లి, ఘంటసాల గ్రామాలనుండి మరియు విజయనగరం సంగీత కళాశాల నుంచి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఘంటసాల నడయాడిన ప్రాంతాలను చూపించారు.

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘ఇంతటి బృహత్కార్యంలో తమ సంస్థ సహ నిర్వాహకులుగా పాలుపంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవంగా ఘంటసాల శతజయంతి ఆరాధనోత్సవం 2022 డిసెంబర్ 4వ తేదీన సింగపూర్ లో ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించి, ఆ కార్యక్రమానికి అందరిని సింగపూర్‌కు రావలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు.

ఘంటసాల వారితో పాటుగా ఇటీవల స్వర్గస్తులైన వారి కుమారులు ఘంటసాల రత్న కుమార్ ని కూడా స్మరిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాలలో ఉదయం 10 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సంవత్సరకాలం పాటు కొనసాగే ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని ‘వంశీ ఆర్ట్ థియేటర్స్’, ‘శుభోదయం మీడియా’ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని