
కరోనా ప్రభావం..గల్ఫ్ కార్మికుల బతుకు దైన్యం
ఎడారి దేశాల్లో ఇబ్బందులు
ఇంటర్నెట్ డెస్క్: కష్టాలు కన్నీళ్లతో సావాసం చేస్తున్న గల్ఫ్ కార్మికులను కరోనా మరింత కుంగదీసింది. వైరస్ వ్యాప్తి కారణంగా చమురు సంస్థలతో సహా ఇతర కంపెనీలు మూతపడ్డాయి. ఈ పరిణామంతో వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. పదో పరకో సంపాదించుకునేందుకు వెళ్లిన వీరిని కరోనా ఇబ్బందులకు గురి చేసింది. మూడు పూటలా తినలేక, అద్దె కట్టలేక, ఇంటికి డబ్బు పంపలేక వారు సతమతమవుతున్నారు. కొవిడ్ నిబంధనల పేరిట వందలాది మందిని నిర్బంధ గృహాల్లో ఉంచుతున్నారు. ఎవరికి వైరస్ సోకినా నామమాత్రపు వైద్యంతోనే సరిపెడుతున్నారు. ఇలా చెబుతూ పోతే గల్ఫ్ కార్మికుల వెతలకు అంతే లేదు.
వైద్యం అందడం లేదు
గల్ఫ్‌లోని ప్రవాస భారతీయులకు ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్లు కరోనా తోడైంది. అప్పు చేసి పొట్టకూటి కోసం ఎడారి సీమకు వెళ్లిన వారి ఆశలను ఈ మహమ్మారి అడియాసలు చేసింది. తెలుగు రాష్ట్రాల వారు గల్ఫ్ దేశాల్లో పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అల్లాడుతున్నారు. కొందరు కరోనా బారిన పడి వైద్యమందక సాయం అర్థిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులనే తప్ప ప్రవాసులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాధిత కుటుంబాల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. గల్ఫ్ దేశాలైన సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌లో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదైంది. ఈ స్థాయి వ్యాప్తితో ప్రవాస భారతీయులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఆ దేశాల్లో 25 లక్షల మంది
గల్ఫ్ దేశాల్లో 25లక్షల మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఆయా దేశాల్లో స్థిర పడిన వారే కాక తాత్కాలిక వీసాలపై వెళ్లిన వారు అక్కడ పని చేస్తున్నారు. వీరంతా గల్ఫ్ దేశాల్లో చమురు కంపెనీలు, గ్యాస్ స్టేషన్లు, నిర్మాణ సంస్థలు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలు, రహదారులు, బ్యాంకింగ్ తదితర చోట్ల విధుల్లో ఉన్నారు. కరోనాతో ఆయిల్ కంపెనీలు చాలా కాలంపాటు మూసివేశారు. నిర్మాణాలు నిలిచిపోయాయి. పరిశ్రమలు ఇంటి నుంచే పని చేయాలనే నిబంధన విధించాయి. పర్యాటక రంగం వెలవెలబోయింది. కొందరికి వైరస్ సోకినా వైద్యమందలేదు. లేబర్ క్యాంపుల్లో వేల సంఖ్యలో తలదాచుకున్నారు. కరోనా సోకిన కార్మికులను అక్కడి సంస్థలు ఒక గదిలో నిర్బంధిస్తున్నాయి. పాస్‌పోర్టులు ముందుగానే స్వాధీనం చేసుకోవడం వల్ల అక్కడి నుంచి బయట పడటం కష్టసాధ్యమవుతోంది.
అరకొరగా వేతనాల చెల్లింపులు
సౌదీలో 50వేలు, యూఏఈలో 45వేలు, కువైట్‌లో 25వేలు, ఖతార్‌లో 15వేలు, ఒమన్‌లో 9వేలు, బహ్రెయిన్‌లో ఆరున్నరవేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. ఇవికాక కుటుంబ సభ్యులను తెలుగు రాష్ట్రాల్లోనే వదిలి ఒంటరిగా వెళ్లిన వారు లక్షల్లోనే ఉన్నారు. బహ్రెయిన్ మినహా మిగతా దేశాల్లో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కాస్తో, కూస్తో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితి, జీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఏవో కొన్ని ప్రముఖ సంస్థలు తప్ప మిగతా కంపెనీలు జీతాలివ్వలేదు. నిర్మాణ సంస్థల్లో కొన్నే వేతనాలు చెల్లించాయి. కరోనా ఎన్నాళ్లుంటుందో, తమ ఉద్యోగాలు ఏమవుతాయో అని ఆందోళన తెలుగువారిలో ఉంది. పని చేయించుకొని రోజువారీ కూలీ చెల్లించకపోవడం, కనీస వేతనం ఇవ్వకపోవడం లాంటి సమస్యలు ప్రవాస భారతీయులను వెంటాడుతున్నాయి.
ఏప్రిల్, మేలో బలవంతపు రాజీనామాలు
ఏప్రిల్, మే నెలల్లో ఒమన్ సహా పలు దేశాల్లో విడతల వారీగా ఉద్యోగులతో రాజీనామాలు చేయించారు. కరోనా ఆర్థిక కారణాలను చూపించి వందలాది కార్మికులను తొలగించాయి. తరువాత నెలరోజుల నోటీసు పీరియడ్‌లోనూ పని చేయించుకొని చాలా మందికి వేతనాలు ఇవ్వలేదు. మరికొన్ని సంస్థలు సగం వేతనాలే ఇచ్చాయి. సమాచారం లేకుండానే కార్మికులను తొలగించిన సంస్థలూ ఉన్నాయి. మార్చి మొదటి వారంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలు లాక్డౌన్ విధించాయి. సరిహద్దులు మూసివేశాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఆయా దేశాల్లోని సంస్థలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఇది ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపింది. అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించినప్పటికీ వారిలో చాలా మంది వలస కార్మికులే ఉన్నారు. ప్రత్యేక నైపుణ్యాలున్నవారు, ఆరోగ్య సిబ్బందిపై మాత్రమే కరోనా ప్రభావం పడలేదు. ఉద్యోగాల్లోనే కొనసాగినప్పటికీ 3- 4నెలలు 25శాతం కోత విధించారు. వీరిలో ఒప్పంద కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతానికి ఉపాధికి గ్యారంటీ ఉన్నా ఒప్పంద గడువు ముగిసిన తరువాత ఉంచుతారా లేదా అన్నది తెలియడం లేదు. ఉద్యోగం చేస్తున్నవారికి జీతాలు అంతంతమాత్రంగానే వస్తుండటం వల్ల కుటుంబ పోషణ భారం అవుతోంది. ప్రభుత్వ లక్షలాది మంది కార్మికులను వందే భారత్ మిషన్ కింద స్వదేశానికి తీసుకొచ్చింది. ఇదే సమయంలో ప్రవాస భారతీయులకు ఆరోగ్య సేవలు అందించేందుకు, కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవి పూర్తిస్థాయిలో అందలేదు.