తానా సభల వేదికగా గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. తానా సభల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు.

Published : 11 Jul 2023 21:27 IST

వాషింగ్టన్ డీసీ(అమెరికా): అమెరికాలో 23వ తానా మహాసభల వేదికగా గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డాక్టర్ రవి వేమూరి, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ, పాతూరి నాగభూషణం, మన్నవ మోహన కృష్ణ, అన్నాబత్తిన జయలక్ష్మి, డాక్టర్ నిమ్మల శేషయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలన్నారు. గుంటూరు జిల్లాను విద్యావంతులు, గొప్పగొప్ప కళాకారులకు పుట్టినిల్లుగా పేర్కొన్న ఆయన.. ఆ జిల్లాలో పుట్టడం తమందరికీ గర్వకారణమన్నారు. కొండవీడు, ఉండవల్లి గుహలు చారిత్రక ప్రాంతాలుగా ప్రసిద్ధికెక్కాయన్నారు. 

ఎన్‌ఆర్‌ఐ టీడీపీకి చెందిన ఎంపవర్‌మెంట్‌ సెల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు డాక్టర్ రవి వేమూరి తెలిపారు.  గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా గుంటూరులో పేద, గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతిభావంతులైన బాలికలకు వసతిగృహం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు నూతన భవన నిర్మాణాలకు ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధానిని మార్చడం ఎవరివల్లా సాధ్యం కాదని పాతూరి నాగభూషణం అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు కీలకపాత్ర పోషించాలన్నారు. మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా నుంచి పెద్దఎత్తున యువత విదేశాలకు తరలివస్తున్నారన్నారు. ముఖ్యంగా అమెరికాలో మంచి అవకాశాలను పొందుతూ జీవితంలో రాణిస్తున్నారని చెప్పారు. 

గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రులు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నాబత్తిన జయలక్ష్మి ఆకాంక్షించారు. పాలకపక్ష అరాచకాలను అడ్డుకోవాలని డాక్టర్‌ నిమ్మల శేషయ్య పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ, మురళీ వెన్నం, భాను మాగులూరి, సామినేని కోటేశ్వరరావు, ఘంటా పున్నారావు, రామ్ చౌదరి ఉప్పుటూరి, ఎంవీ రావు, రాజశేఖర్ చెరుకూరి, బుల్లయ్య చౌదరి ఉన్నవ, వెంకట సుబ్బారావు ఆళ్ళ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు