United States: అమెరికాలో రోజంతా హైడ్రామా

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అమెరికా జైలులో బందీగా ఉన్న పాకిస్థానీ మహిళ ఆఫియా సిద్దీఖి(49)ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టెక్సాస్‌లో ఓ సాయుధ ఆగంతుకుడు చేపట్టిన కిడ్నాప్‌ డ్రామా శనివారం రోజంతా కలకలం రేపి.. సాయంత్రానికి సుఖాంతమైంది. డాలస్‌లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి బ్రిటన్‌కు చెందిన మాలిక్‌ ఫైసల్‌ అక్రం (44) చొరబడి భయాందోళనలకు గురిచేశాడు. శనివారం ప్రార్థనామందిరంలోని

Published : 17 Jan 2022 09:18 IST

టెక్సాస్‌లో నలుగురిని నిర్బంధించిన బ్రిటన్‌ వాసి
పాక్‌ మహిళా ఖైదీని విడుదల చేయాలని డిమాండ్‌
చివరకు ప్రత్యేక దళాల కాల్పుల్లో హతం

కాలీవిల్‌(టెక్సాస్‌), ఇస్లామాబాద్‌: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అమెరికా జైలులో బందీగా ఉన్న పాకిస్థానీ మహిళ ఆఫియా సిద్దీఖి(49)ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టెక్సాస్‌లో ఓ సాయుధ ఆగంతుకుడు చేపట్టిన కిడ్నాప్‌ డ్రామా శనివారం రోజంతా కలకలం రేపి.. సాయంత్రానికి సుఖాంతమైంది. డాలస్‌లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి బ్రిటన్‌కు చెందిన మాలిక్‌ ఫైసల్‌ అక్రం (44) చొరబడి భయాందోళనలకు గురిచేశాడు. శనివారం ప్రార్థనామందిరంలోని నలుగురు భక్తులను నిర్బంధించిన తర్వాత దాదాపు పది గంటలపాటు హైడ్రామా నడిచింది. సిద్దీఖి విడుదల కోరుతూ కిడ్నాపరు ఓ వీడియోను బయటకు వదిలాడు. చివరకు బందీలు నలుగురూ క్షేమంగా విడుదల కాగా, ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడంతో కథ సుఖాంతమయింది. అమెరికా సైనికులపై హత్యాయత్నం చేసిందన్న ఆరోపణలపై ఆఫియా సిద్దీఖి 86 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కాగా, ఈ కిడ్నాపు వ్యవహారంతో సిద్దీఖీకి ఎలాంటి సబంధం లేదని, ఆగంతుకుడి చర్యను తాము కూడా ఖండిస్తున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.  కిడ్నాప్‌ కథ సుఖాంతం అయ్యాక అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్టాలి బెన్నెట్‌ కూడా అధికారులను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

ఎవరీ ఆఫియా సిద్దీఖీ?

పద్దెనిమిదేళ్ల వయసులో పాకిస్థాన్‌ నుంచి అమెరికాకు వెళ్లిన ఆఫియా సిద్దీఖి  బ్రాండైస్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యూరోసైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 2001 నాటి 9/11 ఉగ్రదాడుల తర్వాత ఈమె ఇస్లామిక్‌ సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు, ఉగ్రవాదులకు పది వేల డాలర్ల విలువచేసే రాత్రిపూట కనిపించే కళ్లద్దాలు, పుస్తకాలు కొనిపెట్టినట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) గుర్తించింది. అమెరికా నుంచే అల్‌ఖైదాకు అనుబంధంగా ఆమె పనిచేస్తున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత 2003లో తన ముగ్గురు పిల్లలతో సహా కరాచీలో అదృశ్యమైన సిద్దీఖి అయిదేళ్ల తర్వాత అఫ్గానిస్థాన్‌లో అరెస్టయ్యారు. ఆ సందర్భంగా అమెరికా దళాలు ఆమెను విచారిస్తుండగా.. ఓ అధికారి నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు పాల్పడినట్లు అభియోగం నమోదైంది. ఈ సంఘటనలో అమెరికా సైనికులు క్షేమంగా బయటపడినా, సిద్దీఖి గాయపడ్డారు. అనంతరం ఈమె విడుదల కోరుతూ పాకిస్థాన్‌లో పలుమార్లు ప్రదర్శనలు, ఓ అమెరికన్‌ జర్నలిస్టు కిడ్నాపు కూడా జరిగాయి. సిద్దీఖి విడుదల కోసం ప్రయత్నిస్తానని పాకిస్థాన్‌ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తన ఎన్నికల ప్రచారంలోనూ వాగ్దానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని