
24 గంటల్లో 64 లక్షల డోసుల పంపిణీ!
అమెరికాలో టీకా అందజేతకు సిద్ధమవుతున్న ప్రణాళికలు
వాషింగ్టన్: ఫైజర్ టీకాకు అనుమతి లభించిన తర్వాత 24 గంటల్లోపు దేశవ్యాప్తంగా 6.4 మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. తొలుత మహమ్మారిపై పోరులో ముందు వరుసలో ఉన్న సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని ‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’ ప్రాజెక్టులో పంపిణీ విభాగానికి బాధ్యత వహిస్తున్న జనరల్ గుస్తావ్ పెర్నా తెలిపారు. రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన డోసుల్ని కేటాయించామని.. ఆ వివరాలను ఆయా ప్రభుత్వాలకు శుక్రవారం రాత్రే తెలియజేశామన్నారు.
ఫెడరల్ ఏజెన్సీలకూ వీటి నుంచే..
దేశవ్యాప్తంగా 20 మిలియన్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఉన్నారని.. టీకా అందజేతలో వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని గుస్తావ్ తెలిపారు. అయితే, 6.4 మిలియన్ల డోసుల్లో కొన్నింటిని.. కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న ‘బ్యూరో ఆఫ్ ప్రిజన్స్’, ‘నేషనల్ హెల్త్ సర్వీస్’, వెటరన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఫెడరల్ విభాగాలకూ అందజేస్తామన్నారు. ఉత్పత్తిని బట్టి ప్రతివారం మిలియన్ల కొద్దీ డోసుల్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. డిసెంబరు రెండోవారంలో ఫైజర్ టీకాకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఓ ఛాలెంజ్‌గా స్వీకరించిన ఫెడరల్ ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసిందని శ్వేతసౌధంలోని అధికారులు తెలిపారు. ఫైజర్ నుంచి 40 మిలియన్ల డోసులు, మోడెర్నా నుంచి 20 మిలియన్ల డోసుల కోసం ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని తెలిపారు. ఏప్రిల్ నాటికి అమెరికాలో ప్రతి సాధారణ పౌరుడికి టీకా అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.
హెల్త్‌కేర్ వర్కర్ల తర్వాత వీరికే..
రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ నిల్వ చేయాల్సిన ఆస్పత్రుల్ని ఎంపిక చేశారని అధికారులు తెలిపారు. ఫైజర్ టీకా అతిశీతల వాతావరణంలో నిల్వ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ వసతులు ఉన్న ఆస్పత్రులనే పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఒక్కో రాష్ట్రంలో 3-5 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. హెల్త్‌కేర్ వర్కర్ల తర్వాత సుదీర్ఘ కాలంగా ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న మూడు మిలియన్ల మందికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం బోధన, నిత్యావసర సరకులు అందించడం వంటి ఇతర అత్యవసర సేవల్లో ఉన్న 87 మిలియన్ల మందిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఆ తర్వాత 65 ఏళ్ల పైబడి.. కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే పలుసార్లు ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు. ఇక అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ పాలకవర్గం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మేరకు రాష్ట్రాలకు ఇంకా నిధులు అందాల్సి ఉందని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.