USA: ఐబీఏ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా తమన్నా

అమెరికాలోని న్యూజెర్సీలో ఐబీఏ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 15 Aug 2023 15:30 IST

న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ (IBA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఇండియా డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఎడిష‌న్ ప్రాంతంలోని ఓక్‌ట్రీ రోడ్‌లో ఇండియా డే పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు జాతీయ జెండాను చేతబట్టి.. ‘భారతమాత కి జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పాల్గొన్నారు.

భారతమాత, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో యూ బ్లడ్ అప్ టీం, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆకట్టుకున్నారు. ఆట‌పాట‌ల‌తో అల‌రించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా డప్పు, వాయిద్యాలతో, ఆటపాటలతో పరేడ్‌లో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. పరేడ్‌కు వచ్చిన ప్రవాస భారతీయులు పరస్పరం అభినందించుకున్నారు. వేడుకల్లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించడంతో న్యూజెర్సీ ప్రాంతమంతా సందడిగా మారింది.  శకట ప్రదర్శనలో డాక్టర్ జగదీశ్ యలమంచిలి, ఏపీ భాజపా సెక్రెటరీ పాతూరి నాగభూషణం పాల్గొని రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేశారు.

అమెరికాలో జ‌రిగిన ఈ భార‌త స్వాతంత్య్ర వేడుక‌ల్లో పాల్గొన్న తొలి తెలుగు సంఘం ‘మ‌న అమెరికన్ తెలుగు అసోషియేష‌న్ (MATA)’. ఈ సంద‌ర్భంగా ‘మాటా’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని ప్రవాసభారతీయులకు, భారతీయులందరికీ 77వ‌ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవాసులు తమ మాతృభూమి రుణం తీర్చుకోవాల‌ని కోరారు. ‘మాటా’ యూఎస్ఏ, ‘మాటా’ ఇండియా.. ఇలా రెండు చోట్లా త‌మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు