Ukraine Crisis: తక్షణమే ఉక్రెయిన్‌ వీడండి.. భారత విద్యార్థులకు ప్రభుత్వం అడ్వైజరీ

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులపై సమాచారం

Updated : 22 Feb 2022 13:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: రష్యా - ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులపై సమాచారం కోసం ఎదురుచూడకుండా.. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ మంగళవారం అడ్వైజరీ జారీ చేసింది. 

‘‘మెడికల్‌ యూనివర్శిటీల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ గురించి తెలుసుకోడానికి భారత రాయబార కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అయితే భారత విద్యార్థులు తమ విద్యా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ క్లాసుల ఏర్పాటుకు.. సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. క్లాసుల విషయంలో యూనివర్శిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూడకండి. మీ భద్రత దృష్ట్ట్యా తక్షణమే ఉక్రెయిన్‌ను వీడాలని సూచిస్తున్నాం’’ అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ ఇటీవల కాలంలో జారీ చేసిన మూడో అడ్వైజరీ ఇది. ఇటీవల అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్‌లో ఉండొద్దని హెచ్చరించిన ఎంబసీ.. తాజాగా విద్యార్థులంతా స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. 

ఉక్రెయిన్‌కు మరిన్ని విమానాలు..

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించేందుకుం కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈ ఉదయం దిల్లీ నుంచి ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం ఉక్రెయిన్‌ బయల్దేరింది. ఆ దేశానికి మరిన్ని ప్రత్యేక విమనాలను నడపనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి మార్చి 6 మధ్య నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు ఎయిర్‌ అరేబియా, ఫ్లై దుబాయి, ఖతర్‌ ఎయిర్‌వేస్‌ వంటి రెగ్యులర్‌ విమాన సర్వీసులు కూడా కొనసాగనున్నట్లు పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని