America: భారత సంతతి విద్యార్థిని అదృశ్యం.. 3 వారాలైనా దొరకని ఆచూకీ..!

భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యం (Missing) కావడం అమెరికాలో (America) సంచలనంగా మారింది. మూడు వారాలైనా ఆమె  (Marupally Tanvi) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది.

Published : 10 Feb 2023 22:40 IST

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని (14) అదృశ్యం కావడం అమెరికాలో సంచలనం రేపుతోంది. ఆర్కన్సాస్ రాష్ట్రంలో ఉండే ఆ బాలిక మూడు వారాలుగా కనిపించకుండా పోవడం (Missing) భారతీయ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులతో పాటు వారు ఉంటున్న పట్టణంలోని ప్రజలంతా ఒక్కటై గాలింపు చేపట్టారు. అయితే, ఇటీవల టెక్‌ కంపెనీలు లేఆఫ్‌లు (Layoffs) ప్రకటిస్తుండటం.. ఒకవేళ తన తండ్రి ఉద్యోగం కోల్పోతే భారత్‌కు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఆ విద్యార్థిని ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆర్కన్సాస్ రాష్ట్రంలోని కాన్వే ప్రాంతంలో పవన్‌, శ్రీదేవి అనే భారతీయ జంట నివసిస్తోంది. వారి కూతురు మారుపల్లి తన్వీ (Tanvi Marupally) స్థానిక పాఠశాలలోనే చదువుతున్నారు. అయితే, జనవరి 17న స్కూల్‌కు బయలుదేరిన ఆ విద్యార్థిని అదృశ్యం అయ్యింది. తమ అమ్మాయి ఇంటికి చేరుకోకపోవడంతో తన్వీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం, స్థానికులను ప్రశ్నించిన పోలీసులు.. గాలింపు ముమ్మరం చేశారు. మూడు వారాలైనా తన్వీ ఆచూకీ మాత్రం లభించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించడంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు అంటించారు. పట్టణమంతా ఏకమై తన్వీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విద్యార్థినిని తల్లిదండ్రులతో కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కాన్వే పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఆచూకీ చెప్పిన వారికి 5వేల డాలర్ల రివార్డును తన్వీ కుటుంబం ప్రకటించింది.

ఏళ్లుగా అక్కడే ఉంటున్న తన్వీ కుటుంబం అమెరికా పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తోంది. తండ్రి ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా.. తల్లి శ్రీదేవి ఇటీవలే ఉద్యోగం కోల్పోయినట్లు సమాచారం. ఐటీ కంపెనీలు ప్రకటిస్తోన్న వరుస లేఆఫ్‌లతో తండ్రి ఉద్యోగంపైనా ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. ఒకవేళ శాశ్వత పౌరసత్వం లభించకపోతే భారత్‌కు వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని.. అందువల్లే తమ కూతురు ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటుందని తన్వీ తల్లిదండ్రులు భావిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అమెరికా మీడియా ప్రకారం, గత నవంబర్‌ నుంచి ఇప్పటివరకు సుమారు 2లక్షల మంది ఐటీ ఉద్యోగులకు టెక్‌ కంపెనీలు ఉద్వాసన (Layoffs) పలికినట్లు సమాచారం. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 30 నుంచి 40శాతం మంది హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలున్న భారతీయ నిపుణులే ఉన్నట్లు అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు