తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 21న ఆన్‌లైన్‌ వేదికగా ఇది జరిగింది.

Updated : 23 Feb 2022 09:39 IST

అట్లాంటా: ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 21న ఆన్‌లైన్‌ వేదికగా ఇది జరిగింది. తొలుత తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని చెబుతూ ఇతర దేశాల్లో ఉంటూ మాతృభాషను పరిరక్షించడంలో తానా చేస్తున్న కృషిని వివరించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఆహ్వానం పలికారు. ఇటీవల హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డికి సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్‌ తోటకూర తదితరులు నివాళులర్పించారు. మంత్రి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ హరిబాబు మాట్లాడుతూ మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉంటూ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ పేరిట సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తానా సంస్థను ఆయన అభినందించారు. భారత రాజ్యాంగంలోని 53వ అధికరణం ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యావిధానం ప్రకారం కనీసం 5 వరకు మాతృభాషలో విద్యాబోధన ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్‌లాంటి వృత్తి విద్యల్లోనూ మాతృభాషలోనే విద్యాబోధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాతృభాషాభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ తెలుగు భాషను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకొనేందుకు గల నేపథ్యాన్ని వివరించారు. ‘‘అప్పటి తూర్పు పాకిస్థాన్‌.. ఇప్పటి బంగ్లాదేశ్‌లో అత్యధికంగా ప్రజలు బెంగాలీ భాష మాట్లాడేవారు. అప్పటి పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాషగా బలవంతంగా వారిపై రుద్దడంతో అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో జరిగిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952లో ఎంతోమంది మరణించారు. కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుంచి ఏటా ఫిబ్రవరి 21న అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది’’ అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఏదైనా విషయాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత వివరంగా ఇతర భాషల్లో అర్థం చేసుకోలేమని చెప్పారు. పరిపాలనా భాషగానూ తెలుగు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మరో గౌరవ అతిథిగా పాల్గొన్న మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్‌.ఎస్‌. సాంబశివరావు మాట్లాడారు. మిజోరం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకుని ఉంటుందని.. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రమని చెప్పారు. అక్కడ చాలా తక్కువ మంది తెలుగు వాళ్లు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని తెలిపారు. 

వివిధ రాష్ట్రాల నుంచి పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి చేస్తున్న కృషిని వివరించారు. అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తూ తెలుగు ఖ్యాతిని నిలబెడుతున్న అధికార, అనధికార ప్రముఖులు, తెలుగు సంఘాల పాత్ర తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల దేవదానం రాజు (యానాం), ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ (తమిళనాడు), యజ్ఞ నారాయణ (కేరళ), విజయభాస్కరరెడ్డి (మహారాష్ట్ర), డా.తుర్లపాటి రాజేశ్వరి (ఒడిశా), లండ రుద్రమూర్తి (ఛత్తీస్‌గఢ్‌), రాపోలు బుచ్చిరాములు (గుజరాత్‌), వింజమూరి బాలమురళి (పశ్చిమ బెంగాల్‌), ఆచార్య ఎన్‌.లక్ష్మీ అయ్యర్‌ (రాజస్థాన్‌) కమలాకర రాజేశ్వరి (దిల్లీ) పాల్గొన్నారు. 

అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథి, గౌరవ అతిథులు, విశిష్ఠ అతిథులు, ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’ అనే సాహిత్య కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతుందని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని