Pravasi Bharatiya Divas: ఏ దేశమేగినా..

ప్రవాస భారతీయులు అనగానే... సత్యనాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌... లాంటి పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి.

Updated : 09 Jan 2022 14:15 IST

ఈ రోజు ప్రవాస భారతీయుల దినోత్సవం

ప్రవాస భారతీయులు అనగానే... సత్యనాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌... లాంటి పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ వాళ్లే కాదు, ప్రపంచమంతా విస్తరించారు మనవాళ్లు. కొన్నిచోట్ల ఆర్థిక రంగానికి ఆయువుపట్టుగా నిలిస్తే... ఇంకొన్ని దేశాల్లో రాజకీయాల్ని శాసించే స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కృతీ, సంప్రదాయాల్నీ ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ సందర్భంగా మనమంతా గర్వపడే ఆ విషయాలేంటో చూద్దామా!

భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2020 నాటికి విదేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వారి సంఖ్య మొత్తం 3.2 కోట్లు. ఇందులో భారతీయ పౌరసత్వం ఉన్నవారు దాదాపు 1.4 కోట్లు, భారతీయ సంతతి వారు 1.8 కోట్లు.

* ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లింది భారతీయులే. మన దేశం తర్వాత స్థానాల్లో మెక్సికో (1.1కోట్లు), రష్యా (1.1కోట్లు), చైనా (కోటి), సిరియా (80లక్షలు) దేశాలున్నాయి.

* ఇండియా వెలుపల అత్యధికంగా మనవాళ్లు నివసిస్తున్న దేశం అమెరికా. అక్కడ 44.60లక్షల మంది ఉన్నారు. వారిలో 12 లక్షల 80 వేల మంది ప్రవాసులు, 31 లక్షల 80 వేల మంది భారత సంతతికి చెందినవాళ్లు.

* అత్యధికంగా ప్రవాస భారతీయులున్న దేశాలు... యూఏఈ (34లక్షలు), సౌదీ అరేబియా(దాదాపు 26లక్షలు), అమెరికా(12.80 లక్షలు). తర్వాతి స్థానాల్లో కువైట్‌, ఖతార్‌, ఒమన్‌, నేపాల్‌, యూకే దేశాలున్నాయి.

* మారిషస్‌లో 66శాతం జనాభా భారతీయ మూలాలున్నవారే.

* ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపిస్తున్న వారిలో మొదటిస్థానంలో ఉన్నది మనవాళ్లే. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2020-21 ఏడాదిలో భారత్‌కు ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు.

మినీ ఇండియాలు!

ప్రపంచంలో ఏ మూలకెళ్లినా భారత్‌ ప్రభావం ఉంటుంది. అచ్చంగా మన సంస్కృతీ, సంప్రదాయాలూ, రుచులతో ‘మినీ ఇండియా’లుగా పేరు తెచ్చుకున్న కొన్ని ప్రదేశాలున్నాయి.

* సౌతాల్‌, లండన్‌: యాభై వేలకుపైగా భారతీయులు ఉండే ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ గురుద్వారా, దేవాలయం కొలువుదీరి ఉన్నాయి. దీపావళీ, హోలీలాంటి మన పండుగల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.

* లిటిల్‌ ఇండియా, కౌలాలంపూర్‌: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్స్‌ ప్రాంతాన్ని లిటిల్‌ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి స్థానికుల్లో ఎక్కువమంది భారతీయ మూలాలున్నవారే. భారత్‌లో దొరికే ప్రతి వస్తువూ ఇక్కడ లభిస్తుంది. ఈ ప్రాంతంలో నడుస్తుంటే భారతీయ వీధుల్లో తిరిగినట్టే ఉంటుందంటారు.

* డెవాన్‌ ఎవెన్యూ, షికాగో: అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తే పెద్ద ఎత్తున భారతీయ రెస్టరెంట్లే కాదు... చీరల దుకాణాలూ అత్యధికంగా ఉంటాయి.

* లిటిల్‌ ఇండియా, సింగపూర్‌: మన దేశ సంస్కృతి కనిపించే ఈ ప్రాంతంలో భారతీయ రెస్టరెంట్లూ, దుకాణ సముదాయాలూ చాలా ఎక్కువ. అన్నిరకాల రుచులూ దొరుకుతాయి.

* రూ దు ఫాబొ, ప్యారిస్‌: ప్రపంచ ఫ్యాషన్‌ రాజధాని ప్యారిస్‌కి వెళ్లిన మనవాళ్లు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం రూ దు ఫాబొ. అక్కడ భారతీయులకు అవసరమైన దేశీ సరకులే కాదు, ప్యారిస్‌ ఫ్యాషన్లు అద్దిన దుస్తులూ దొరుకుతాయి.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts