NewYork: న్యూయార్క్‌లో వైభవంగా జ‌గ‌న్నాథ రథయాత్ర

న్యూయార్క్‌లో జనన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

Updated : 12 Jun 2023 20:13 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్ మహా నగరంలో జగనాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వారితోపాటు అమెరికా, అఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. భక్తులంతా భారతీయ సంప్రదాయ వస్త్రధారణ చేసి ఈ రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాథుడి రథాన్ని పసుపు, ఎరుపు రంగుల్లో సుందరంగా అలంకరించారు. న్యూయార్క్‌లోని 5 అవెన్యూ E45 స్ట్రీట్ నుంచి W8 స్ట్రీట్ వరకు జరిగిన ఈ మహోత్సవంలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను ఉత్సవంగా తీసుకువెళ్లే రథాలను లాగేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ‘‘ హరే కృష్ణా హరే కృష్ణా.. కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే’’ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తరువాత వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ దగ్గర మహా ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.

రథయాత్ర ప్రారంభం ఇలా..

భార‌త్‌లోని పూరీలో జగనాథుడి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అక్కడ నిర్వహించే రథయాత్రకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ యాత్రకు విదేశీయులు కూడా పెద్ద ఎత్తున తరలివ‌స్తారు. శతాబ్దాలుగా జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. దానిని ఆదర్శంగా తీసుకున్న స్వామి ప్రభుపాద అమెరికాలో కూడా ఈ రథయాత్రను మొదలుపెట్టారు. 1966 జులైలో ప్రభుపాద అమెరికాలో ఇస్కాన్‌ను స్థాపించారు. ఆ తర్వాత మొట్టమొదటి రథయాత్రను నిర్వహించారు. ఆ త‌ర్వాత అన్ని ఇస్కాన్ దేవాలయ పరిసరాల్లో జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్రలు నిర్వహించాలని తన శిష్యులకు పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇస్కాన్‌ దేవాలయాల్లో ఒకేసారి రథయాత్ర నిర్వహించాలని కోరారు. ఆయన ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. దైవదర్శనం కోసం సాధార‌ణంగా భ‌క్తులు దేవాల‌యానికి వెళ్లాలి. కానీ, ఇలాంటి రథయాత్రలో భగవంతుడే స్వయంగా భక్తుల దగ్గరికి వచ్చి తన కృపను ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. రథయాత్ర సందర్భంగా పుస్తకాలను, ప్రసాదాన్ని పంచిపెడుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు