NTR: దివంగత నేత ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి: జయరాం కోమటి

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ వర్ధంతిని ఈనెల 18న ఘనంగా నిర్వహించాలని తెదేపా నేత, ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ కోఆర్టినేటర్‌ జయరాం కోమటి అన్నారు. 

Updated : 12 Jan 2023 00:20 IST

అమెరికా: భారత దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారని తెదేపా నేత, ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ కోఆర్డినేటర్‌ జయరాం అన్నారు. యూఎస్‌లోని తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నగర పార్టీ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్‌  అభిమానులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలు గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలిపారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 18న ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రజా జీవితం, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత  ప్రమాణాల గురించి మాట్లాడుకున్నపుడు ప్రప్రథమంగా గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్‌ అని అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, మహానాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ ఒక చారిత్రక అవసరంగా తెలుగు ప్రజలు భావించారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజా నాయకుడిగా, చరిత్రలో, ప్రజల గుండెల్లో ఆ మహోన్నత వ్యక్తి స్థానం సుస్థిరం అని కొనియాడారు. 

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు చెందిన యువతరం, సామాన్యులు, విద్యావంతులు, మహిళలకు రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి, సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా ఖ్యాతి పొందారన్నారు. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి, తన ఆలోచనలతో నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్‌ ఛరిష్మాను ఆంగ్ల ప్రసార మాద్యమాలు సైతం కొనియాడారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భరత్‌ శర్మ ముప్పిరాల, వెంకయ్య చౌదరి జట్టి, హరి ఎం, భాస్కర్‌రావు మన్నవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని