TANA: తానా మహాసభలకు ధ్యానగురువు దాజీ

తానా మహాసభలకు ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్‌ పాటిల్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు తానా ప్రతినిధులు ఆయనకు ఆహ్వానం పంపారు.

Updated : 03 Jun 2023 19:45 IST

ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ ధ్యాన గురువు, దాజీగా పిలిచే కమలేశ్‌ డి. పటేల్‌ను మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానించారు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని చెప్పే దాజీ హైదరాబాద్‌కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతివనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌గా పేరుపొందిన ఈ ప్రాంతంలో ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం ఉంది. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ధ్యాన గురువుగా చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన్ను ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. శ్రీరామచంద్రమిషన్‌, హార్ట్‌ఫుల్‌ నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టులను కూడా ఆయన ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని