సింగపూర్‌లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వేడుకలు సింగపూర్‌లో ఘనంగా జరిగాయి. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ప్రసారం చేసిన

Published : 21 Nov 2021 19:22 IST

సింగపూర్‌: కార్తీక పౌర్ణమి వేడుకలు సింగపూర్‌లో ఘనంగా జరిగాయి. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ప్రసారం చేసిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు వారు వీక్షించి భక్తితో తన్మయత్వం చెందారు. హరికథకు పుట్టినిల్లయిన విజయనగరం నుంచి ‘హరికథా చూడామణి’ కాళ్ళ నిర్మల భాగవతారిణి ఆలపించిన హరికథా గానంతో కార్యక్రమం ప్రారంభించారు. వల్లీ కళ్యాణం ఇతివృత్తంగా రుద్రాక్ష మహిమను తెలుపుతూ చక్కటి కథాగానంతో, పద్యాలతో మృదుమధుర గాత్రంతో అందరిని ఆకట్టుకున్నారు. ఎం.జి.భానుహర్ష వయోలిన్‌, యమ్.మహేశ్వరరావు మృదంగం  హరికథలో మరింత లీనం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి, ‘శ్రీ విఘ్నేశ్వర కళా బృందం’ బుర్రకథ కళాకారులు ‘పార్వతీ కళ్యాణ’ ఘట్టాన్ని చక్కటి తెలుగు మాటలలో లయబద్ధంగా వినిపించారు. ప్రధాన కథకులుగా యడవల్లి కృష్ణ ప్రసాద్ పాల్గొనగా, వచనంతో చిరంజీవి, హాస్యంతో కన్నబాబు సహకారాన్ని అందించి మెప్పించారు.

ఈ సందర్భంగా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ ‘కరోనా కష్టకాలంలో ఆదరణ కరవైపోతున్న హరికథ, బుర్రకథ  వంటి సంప్రదాయక కళలకు చేయూతనివ్వాలనుకున్నాం. అందుకే కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తి మార్గంతో మేళవించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి ‘గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం ఛారిటబుల్ ఫౌండేషన్’ సంస్థ, సింగపూర్ నుంచి స్థానిక సభ్యులు ముందుకు వచ్చారు. కథాగానం వినిపించిన కళాకారులకు పారితోషికాలు అందించడం చాలా ఆనందంగా ఉంది’ అని  దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి స్థానిక గాయనీగాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, విద్యాధరి కాపవరపు, రాధికా నడదూరు, షర్మిళ చిత్రాడ, యడవల్లి శేషుకుమారి, శ్రీవిద్య , శ్రీరామ్, పాల్గొని చక్కటి శాస్త్రీయ శివభక్తి గీతాలను  ఆలపించారు. రామాంజనేయులు చామిరాజు వ్యాఖ్యానం చేయగా, భాస్కర్ ఊలపల్లి, రాధిక మంగిపూడి సహ నిర్వాహకులు వ్యవహరించారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వాహకులుగా నడిపించిన ఈ కార్యక్రమాన్ని సుమారు 1000 మంది పైగా ప్రపంచ నలుమూలల నుండి యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ద్వారా వీక్షించారు.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు