
ఘనంగా కోటి సాయి గాయత్రి మహా మంత్ర పారాయణం
కోటి మందికి అన్నదాన కార్యక్రమం
శాన్హొసె (కాలిఫోర్నియా): అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి భారతీయ ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భారత్లోనే కాకుండా అమెరికా, కెనడాలలో కూడా భక్తి, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సంస్థ ‘విశ్వ సాయి ద్వారకామాయి శక్తి పీఠం’. విశ్వ మానవ శ్రేయస్సు కోరుతూ ఈ సంస్థ సభ్యులు వరుసగా ఆరో ఏడాది అమెరికాలో కోటి సాయి గాయత్రి మహా మంత్ర పారాయణ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. అక్టోబర్ 25 దసరా పర్వదినం సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం.. డిసెంబర్ 29, దత్త జయంతి వరకు కొనసాగింది. టీకా కార్యక్రమం విజయవంతమై కొవిడ్ మహమ్మారి అంతం కావాలని, ప్రపంచమంతా శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ శాన్హోసె నగరంలో చివరిరోజు సాయి దత్త శాంతి హోమాన్ని కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సాయిబాబా ప్రవచించిన శ్రద్ధ, సబూరీలను పాటిస్తూ.. పూజలు నిర్వహించారు. సాయి నామస్మరణతో తాము నిజమైన సుఖశాంతులను పొందామని కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కోటి మందికి అన్నప్రసాదం అందినట్టు నిర్వాహకులు తెలిపారు.
సాయి పరబ్రహ్మ తత్వాన్ని ప్రచారం చేసే పవిత్ర కార్యానికి గాను ఆ సాయినాథుడే తమను సాధనాలుగా ఎంచుకున్నారని కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆధ్యాత్మిక, అన్నదాన కార్యక్రమంలో సహకరించిన వారందరికీ పీఠం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన మీడియాకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది కోటి సాయి గాయత్రి కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.