Atlanta: అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి

అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు.

Published : 24 Jun 2024 17:20 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. జూన్ 22 శనివారం రోజున జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని జేడ్ బాంక్వెట్ హాల్లో ఈ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దాదాపు 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. మూడు పార్టీల జెండాలు, కండువాలతో నినాదాలు చేశారు.

‘జై చంద్రబాబు’, ‘జై పవన్ కల్యాణ్‌’, ‘జై భాజపా’, ‘జయహో కూటమి’ అంటూ హోరెత్తించారు. కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా బ్యానర్లు, జెండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం.

వ్యాఖ్యాతలు సురేశ్‌ పెద్ది, సురేష్ కరోతు అందరికీ స్వాగతం పలికారు. ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలన చేయించి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై తెదేపా అట్లాంటా నాయకులు సతీష్ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు. భారత్‌ నుంచి ఏపీ శాసనసభ సభ్యులు, తెదేపా, జనసేన లీడర్లు పంపిన వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిపోనంత జనం రావడం ఒక ఎత్తైతే.. నిల్చొని కూడా కార్యక్రమం ఆసాంతం తిలకించడం మరొక ఎత్తు.  పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. అతిథులు ఎక్కువగా వస్తారన్న అంచనాలతో 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. అట్లాంటా వాసి, అందరికీ సుపరిచితులు, గుడివాడ గడ్డపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన రాము వెనిగండ్ల జూమ్ మీటింగ్ ద్వారా లైవ్‌లోకి వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారైల సేవలను, ముఖ్యంగా అట్లాంటా వారి సేవలను అభినందించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని కోరారు. తర్వాత కీ నోట్ స్పీకర్స్ మల్లిక్ మేదరమెట్ల, సురేష్ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్ కోఆర్డినేటర్ వేణు దండా ఫుడ్ స్పాన్సర్స్ అందరినీ పేరు పేరునా అభినందించారు. తొలిసారి అట్లాంటాలోని రెస్టారెంట్స్ అన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం విశేషమన్నారు. భోజనాల అనంతరం ఎన్నారై తెదేపా అట్లాంటా టీం, జనసేన నాయకులు కూటమి కేక్ కట్ చేసి అందరికీ పంచారు.

రామోజీరావుకు ఘన నివాళి

మీడియా మొఘల్, అక్షరాన్నే ఆయుధంగా మార్చిన యోధుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీ రావుకు ఈ కార్యక్రమంలో ఘన నివాళులు అర్పించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను స్మరించుకుని పలువురు సందేశం ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని