Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి లావు అంజయ్య చౌదరి సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల లావు అంజయ్య చౌదరి సంతాపం.సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

Published : 15 Nov 2022 22:35 IST

అమెరికా: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. లెజెండరీ నటుడు కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు తానా తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వెండి తెర వేల్పులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణల మృతితో ఆనాటి శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు.

వినూత్న సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసిన కృష్ణ మరణం ఆయన అభిమానులకే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. తెలుగు వారికి జేమ్స్ బాండ్, కౌ బాయ్ అంటే కృష్ణ మాత్రమేనన్నారు. నిజ జీవితంలో అల్లూరి సీతారామరాజు రూపం ఎలా వుంటుందో స్పష్టంగా తెలియనప్పటికీ తెలుగు వారికి మాత్రం అల్లూరి అంటే మదిలో మెదిలే రూపం సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన  కీర్తి అజరామరమని కొనియాడారు. మంచి మనసున్న వ్యక్తిగా, మానవతా వాదిగా, వివాదాలకు దూరంగా ఉంటూ అందరి మంచినీ కోరుకొనే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి నిలిచి వుంటుందని పేర్కొన్నారు.ఈ కష్ట సమయంలో కృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించానలి ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని