London: డా.బాపూజీరావుకు బిపా జీవన సాఫల్య పురస్కారం

వైద్య రంగంలో 50 ఏళ్లపాటు చేసిన విశేష కృషిని అభినందిస్తూ.. తెలుగు వైద్యుడు బాపూజీరావును బ్రిటిష్‌ ఇండియన్‌ సైకియాట్రిస్ట్‌ అసోసియేషన్‌ (BIPA) జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

Updated : 16 Jun 2023 12:05 IST

లండన్‌: తెలుగు వైద్యుడు డా. బాపూజీరావుకు అరుదైన గౌరవం దక్కింది. వైద్యరంగంలో 50 ఏళ్లపాటు ఆయన చేసిన విశేష సేవలను అభినందిస్తూ బ్రిటిష్‌ ఇండియన్‌ సైకియాట్రిస్ట్‌ అసోసియేషన్‌ (BIPA) జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. తెలుగు వైద్యుడికి ఇంతటి గౌరవం దక్కడం పట్ల ఇంగ్లండ్‌లోని తెలుగువారు సహా, పలువురు ఎన్ఆర్‌ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డా. వెలగపూడి బాపూజీరావు గుంటూరు జిల్లా శాలపాడులో వీరయ్య, సామ్రాజ్యమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో కాలేజీ విద్యను అభ్యసించిన ఆయన.. గుంటూరు మెడికల్‌ కాలేజీ నుంచి 1967లో ఎంబీబీఎస్‌ పట్టా పొందారు. మానసిక వైద్య శిక్షణను పుదుచ్చేరిలో ఆరంభించారు. కొన్నాళ్లపాటు బెంగళూరులోని  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లోనూ శిక్షణ పొందారు.  ఆ తర్వాత 1973లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఎండీ పూర్తి చేశారు. అదే ఏడాది ఇంగ్లండ్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో చేరారు. తాజాగా ఎన్‌హెచ్‌ఎస్‌లో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఎంఆర్‌సీ సైకియాట్రీ పూర్తి చేశారు. ఎఫ్‌ఆర్‌సీ సైకియాట్రీ పొందారు.

రాయల్‌ కాలేజ్ ఆఫ్‌ సైకియాట్రిస్ట్‌ , వేల్స్‌ సైకియాట్రిస్ట్‌ సొసైటీ, బ్రిటిష్‌ ఇండియన్‌ సైకియాట్రిస్ట్‌ అసోసియేషన్‌, బ్రిటిష్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ తదితర సంస్థల్లో బాపూజీరావు వివిధ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రా మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వార్షిక మ్యాగజైన్లకు ఎడిటర్‌గా సేవలందించారు. కొన్నాళ్లపాటు బాపూజీరావు యూరోపియన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. విదేశాల్లో విశిష్ట గుర్తింపు పొందిన ఆయన.. స్వగ్రామంలోనూ విరివిగా సేవలందించారు. తన సతీమణి నళిని గుర్తుగా స్వగ్రామం శాలపాడులో కమ్యూనిటీ సెంటర్‌ను నిర్మించేందుకు ఆర్థిక సాయం చేశారు. దేవాలయాల పునర్నిర్మాణానికి చేయూతనందించారు. అంతేకాకుండా విదేశాల్లోని భారతీయ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు మెంటార్‌గానూ తన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు