Awards: ప్రసాద్‌ తోటకూరకు ‘మండలి సంస్కృతి పురస్కారం’

ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు.....

Updated : 02 Aug 2021 19:58 IST

ఆగస్టు 4న ప్రదానోత్సవం

హైదరాబాద్‌: ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు పేరుమీదుగా ఏటా అందజేసే సంస్కృతి పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 4న (బుధవారం) జరగనుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలోని ఎన్‌.టి.ఆర్‌. కళామందిరంలో మధ్యాహ్నం 3గంటలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషిచేసిన వారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం- మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా 2020కి గాను ‘అహ్మదాబాద్‌ ఆంధ్రమహాసభ’, 2021కి గాను ప్రముఖ ఎన్నారై, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు ప్రసాద్‌ తోటకూరను ఎంపిక చేశారు.

గుజరాత్‌లో నివసిస్తున్న తెలుగువారిలో మన భాషా సంస్కృతుల పట్ల మమకారాన్ని సజీవంగా ఉంచడంలో దాదాపు 75 ఏళ్లుగా విశేష కృషిచేస్తున్నందుకు అహ్మదాబాద్‌ ఆంధ్రమహాసభను ఈ పురస్కారానికి ఎంపిక చేయగా.. అమెరికాలో ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఎంతోమంది కవులు, కళాకారుల బృందాలతో అక్కడ ప్రదర్శనలిప్పించి గౌరవించడం ద్వారా భాషా, సంస్కృతులకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రసాద్‌ తోటకూరను ఈ పురస్కారంతో గౌరవించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పశ్చిమబెంగాల్‌ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ శశి పంజా,  ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, గౌరవ అతిథిగా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంథి భవానీ ప్రసాద్‌ హాజరు కానున్నారు. పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తంగెడ కిషన్‌ రావు అధ్యక్షత వహించనుండగా.. మండలి వెంకటకృష్ణారావు తనయుడు, మాజీ మంత్రి  బుద్ధప్రసాద్‌ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌, డైరెక్టర్‌ I/C ఆచార్య వై.రెడ్డి శ్యామల ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు