
టీకా అభివృద్ధిని నిలిపేసిన మెర్క్!
మెరుగైన ఫలితాలు రాకపోవడంతోనే..
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న ప్రముఖ అమెరికన్ ఔషధ సంస్థ మెర్క్, వాటి అభివృద్ధిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మెర్క్ తయారుచేసిన రెండు వ్యాక్సిన్లు తొలి దశ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా, అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలకు దీటుగా మెర్క్ ఔషధ సంస్థ V590, V591 పేరుతో రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఆ రెండు సంస్థల వ్యాక్సిన్‌తో పోలిస్తే మెర్క్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ను ఒకే డోసులో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో అమెరికా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం మెర్క్ సంస్థకు ఆర్థిక సహాయం అందించింది. అయితే, మొదటి దశ ఫలితాల విశ్లేషణలో వ్యాక్సిన్లు మెరుగైన ఫలితం చూపించక పోవడంతో ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు తాజాగా మెర్క్ ప్రకటించింది. ఇందుకు బదులు, కొవిడ్ చికిత్సపై దృష్టి సారిస్తామని పేర్కొంది. MK-4482, MK-7110 పేరుతో తయారు చేసిన కొవిడ్ ఔషధాలపై దృష్టి కేంద్రీకరిస్తామని మెర్క్ ఔషధ సంస్థ వెల్లడించింది. ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటికే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమెరికాలో రెండు కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది.
ఇవీ చదవండి..
మరిన్ని కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు
అమల్లోకి బైడెన్ ఆర్థిక ప్రణాళిక