సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లుకు ‘నాటా’ పురస్కారం

అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభల్లో తెలుగువాడైన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వర్లు చంచాను ‘నాటా-2023 ఎక్స్‌లెన్స్‌’పురస్కారంతో గౌరవించారు.

Published : 06 Jul 2023 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభల్లో తెలుగువాడైన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వర్లు చంచాను ‘నాటా-2023 ఎక్స్‌లెన్స్‌’పురస్కారంతో గౌరవించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని బెడుసుపల్లి అనే మారుమూల గ్రామంలో వెంకటేశ్వర్లు జన్మించారు. ఆయన కష్టపడి చదివి పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో  పీహెచ్‌డీ చేశారు. కరోనాతో మానవాళి గజగజలాడిన విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు చేసిన విస్తృత పరిశోధనలు ఎంతగానో ఉపకరించాయి. 

ప్రస్తుతం వెంకటేశ్వర్లు ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా సంస్థ మెర్క్‌లో అసోసియేట్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఎమ్రాయ్‌ యూనివర్సిటీలో ఇమ్యునాలజీ, వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్ అంశంపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. వైరాలజీ, ఇమ్యునాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా 1965లో నాగపుర్‌ సమీపంలోని చాందీపురాలో వెలుగుచూసిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కట్టడికి టీకా తయారు చేసే దిశగా డాక్టర్‌ వెంకటేశ్వర్లు చేసిన పరిశోధనలు అప్పట్లో ఎంతగానో తోడ్పడ్డాయి. కొవిడ్ సమయంలో వివిధ మాధ్యమాల ద్వారా తన సూచనలు, సలహాలతో ప్రజల్లో ఆయన ఎంతో ధైర్యం నింపారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కృషిని అభినందిస్తూ నాటా ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కన్వీనర్‌ ఎన్‌ఎమ్‌ఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని