నాటా మహాసభల్లో ‘మహిళా సాధికారత’కు వినూత్న కార్యక్రమాలు: స్వాతి

డాలస్‌లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) మహాసభల్లో మహిళా సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు  నాటా కన్వెన్షన్‌ విమెన్స్ ఫోరం ఛైర్‌పర్సన్‌ స్వాతి సానపురెడ్డి వెల్లడించారు.

Published : 29 Jun 2023 16:51 IST

డాలస్‌: అమెరికాలోని డాలస్‌లో జులై 1,2 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2023 మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే విమెన్స్ ఫోరం కార్యక్రమాలను మహిళా సాధికారతే లక్ష్యంగా వినూత్న ఏర్పాట్లు చేస్తున్నట్టు నాటా కన్వెన్షన్‌ విమెన్స్‌ ఫోరం  ఛైర్‌పర్సన్ స్వాతి సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదని.. మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. శనివారం నాటి కార్యక్రమాల్లో “మహిళా పరివర్తన” శతాబ్దాలుగా మహిళ ఎదుగుదలను "అతివతత్వం పరిపూర్ణత్వం" అనే సంగీత నృత్య దృశ్య రూపకంగా ప్రదర్శిస్తామని తెలిపారు. దీంతో పాటు  హాస్య వినోదం, మహిళా ప్రతిభ- వివిధ రంగాల్లో ప్రముఖుల ఉపన్యాసాలు,  చర్చలు ఉంటాయని తెలిపారు. అలాగే,  1930 నుంచి 1980 వరకు ఎంతో శ్రమపడి శ్రద్దతో సేకరించిన పురాతన చీరలను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. 

ఆదివారం నాటి కార్యక్రమం టాక్ ఆఫ్ ద టౌన్‌తో మొదలు పెట్టి సంగీత సాహిత్య సమ్మోహనంలో మాన్యుల మన్ననతో సాగి, మహిళా ప్రతిభ- వివిధ రంగాల్లో ప్రముఖలతో చర్చలు, మహిళా తెలుసుకో సెగ్మెంట్‌లో అలంకరణ పరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవల్సిన సూచనలు, సొగసు చూడతరమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటాయని ఆమె వివరించారు. నాటా సభల్లో నిర్వహించే మహిళా ఫోరమ్‌కు హాజరయ్యే అతిథుల జాబితాలో వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన వాసిరెడ్డి  పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్, వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పాల్గొంటారని తెలిపారు. వీరే కాకుండా తెలుగు సినీ తారలెవరు తళుక్కుమంటారో వచ్చి చూడాల్సిందేనన్నారు. క్రిష్ణవేణి శీలం, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, ప్రశాంతి చింతారెడ్డి, లక్ష్మీ కొమ్మూరి, గాయత్రి గౌని, అను బెనకట్టి, కవిత రాణి కోటి, , లక్ష్మి సజిత అళహరి,సంధ్య క్రాలేటి, స్వర్ణ అట్లూరి జట్టుగా అందరిదీ 'ఒకే మాట ఒకే బాట ' అంటూ గత ఆరు నెలలుగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు స్వాతి తెలిపారు.  
 
ఈ రెండు రోజుల్లో రూం నెం.164లో ఈ ఫోరం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.  అందరికీ నచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసేందుకు ఆహ్వానిస్తున్నామని విజ్ఞప్తి చేశారు. నాటా  అధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి, కన్వీనర్ ఎన్నెమ్మెస్ రెడ్డి తమను ఎంతగానో ప్రోత్సహించి అన్నివిధాల సహకరించారని, వారి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని