నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ‘కిక్ ఆఫ్ ఈవెంట్’కు విశేష స్పందన

ప్రతి రెండేళ్లకోసారి అమెరికాలో వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. 2023 మే 26 నుంచి 28 వరకు న్యూజెర్సీ ఎక్స్‌పో సెంటర్‌, ఎడిసన్‌లో జరగబోయే ఈ సంబరాలకు సన్నద్ధం చేసేలా తాజాగా నిర్వహించిన ‘కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌’కు విశేష స్పందన లభించింది.

Published : 14 Nov 2022 16:27 IST

ఎడిసన్: రెండేళ్లకోసారి అమెరికాలో వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. 2023 మే 26 నుంచి 28 వరకు న్యూజెర్సీ ఎక్స్‌పో సెంటర్‌, ఎడిసన్‌లో జరగబోయే ఈ సంబరాలకు సన్నద్ధం చేసేలా తాజాగా నిర్వహించిన ‘కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌’కు విశేష స్పందన లభించింది. వందలాది తెలుగు ప్రజలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు. స్థానిక సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు మందిరం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి గణేశ ప్రార్థన, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో నాట్స్ ఛైర్‌ విమెన్‌ అరుణ గంటి, సంబరాల కో-కన్వీనర్ వసుంధర దేసు, బిందు ఎలమంచిలి, స్వాతి అట్లూరి, ఉమా మాకం,  గాయత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 7వ నాట్స్ అమెరికా సంబరాలు 2023 మే 26 నుంచి 28 వరకు న్యూజెర్సీలో జరుగుతాయని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి ప్రకటించారు. అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానిని సభకు పరిచయం చేశారు. ‘భాషే రమ్యం సేవే గమ్యం’ అనే నినాదంతో స్థాపించిన నాట్స్ సంస్థ సేవకు, భాషకు సమానంగా ప్రాధాన్యత  ఇస్తూ చేస్తోన్న అనేక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాల ద్వారా అమెరికా సహా తెలుగు రాష్ట్రాల్లో చేస్తోన్న సేవల్ని వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాట్స్‌ జాతీయ కార్యవర్గ సభ్యుల్ని సభకు పరిచయం చేశారు. తెలుగు జాతికి నాట్స్‌ అండగా ఉంటుందనేది అనేక సంఘటనలు నిరూపించాయని నాట్స్ ఛైర్‌ విమెన్‌ అరుణ గంటి అన్నారు. నాట్స్ బృందంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని.. ఉత్సాహంగా పనిచేసే ప్రతి ఒక్కరికీ తాము స్వాగతం పలుకుతామని ఆమె తెలిపారు. నాట్స్ మహిళలకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక మహిళా జాతీయ వింగ్‌ను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్థిరత్వం, మహిళా సమస్యలకు పరిష్కారం, చిన్న పిల్లల్లో సామాజిక స్పృహ కల్పించే కార్యక్రమాలను నాట్స్‌ అధ్యక్షులతో కలిసి రూపకల్పన చేసినట్టు వివరించారు.

అనంతరం సంబరాల కోర్ కమిటీ సభ్యులైన రాజేంద్ర అప్పలనేని - కో-కన్వీనర్, వసుంధర దేసు - కో కన్వీనర్, రావు తుమ్మలపెంట (టీపీ) - కో-ఆర్డినేటర్, విజయ్ బండ్ల - కో-ఆర్డినేటర్, శ్రీహరి మందాడి - డిప్యూటీ కన్వీనర్, రాజ్ అల్లాడ - డిప్యూటీ కన్వీనర్, శ్యామ్ నాళం - కాన్ఫరెన్స్ సెక్రటరీ, చక్రధర్ వోలేటి- కాన్ఫరెన్స్ ట్రెజరర్, రంజిత్ చాగంటి- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్)లను ఆమె సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత, స్థానిక నృత్య సంస్థలైన నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డాన్స్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమీ, సెంటర్ ఫర్ కూచిపూడి డ్యాన్స్‌,  కవి’స్‌  స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ సంస్థలకు చెందిన విద్యార్థులు, చిన్నారుల నృత్యాలు ఆహూతులను అలరించాయి. ప్రముఖ గాయకులు హేమచంద్ర, మౌనమిల తెలుగు పాటల ప్రవాహం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు సినీ పాటలతో ఆ గాయకులు ఉర్రూతలూగించారు. ఆద్యంతం తెలుగు ఆట, పాటల మేళవింపుతో ‘కిక్ ఆఫ్ ఈవెంట్’ ఉత్సాహభరితంగా కొనసాగింది.

ఈసారి నాట్స్ తెలుగు సంబరాలు న్యూజెర్సీ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్స్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని నాట్స్‌-అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని అన్నారు. తెలుగు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు తాము ఎప్పుడూ శాయశక్తులా కృషిచేస్తున్నామన్నారు. సంబరాలు అంటే కేవలం విందు, వినోదం మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, తోటి వారికి సాయం చేయాలనే సేవా దృక్పథం.. ఇవన్నీ కలగలిసి ఉంటాయన్నారు. ఆదరణకు నోచుకోని, మరుగున పడుతున్న కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించనున్నట్టు శ్రీధర్ తెలిపారు. కేవలం పది రోజుల క్రితమే నాట్స్ ఇచ్చిన పిలుపును అందుకొని వందలాది ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా తెలుగు సంబరాలకు ఇది కేవలం టీజర్‌ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, శ్యాం నాళం, మురళీ కృష్ణ మేడిచెర్ల, కృష్ణ అనుమోలు, కవితా తోటకూర, గాయత్రీ, బిందు యలమంచిలి, శ్రీనివాస్ భీమినేని, ఇతర సంబరాలు బృందం సభ్యుల సమష్టి కృషి ఫలితంగానే ఈ ‘కిక్ ఆఫ్ ఈవెంట్’ విజయవంతమైందని ప్రశంసించారు. నాట్స్ డాక్యుమెంటరీ కోసం అడిగిన వెంటనే వాయిస్ ఇచ్చిన ప్రముఖ నటుడు సాయికుమార్‌కు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ ఈవెంట్‌ ఇచ్చిన ఉత్సాహంతో అమెరికా తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీధర్‌ చెప్పారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో వారిలో నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్ ఛైర్‌ విమెన్ అరుణ గంటి, డిప్యూటీ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ గౌరవ బోర్డ్ సభ్యులు డా.రవి ఆలపాటి, శేఖరం కొత్త,  బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ వెనిగళ్ల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల,  వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & ఫైనాన్స్) భాను ధూళిపాళ్ల,  వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్‌ బుంగటావుల, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్), మదన్ పాములపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్) గురు కిరణ్ దేసు, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ - సూర్య గుత్తికొండ ఉన్నారు. తానా, ఆటా, నాటా, టీఎల్‌సీఏ, టీఏజీడీవీ, తాటా, స్థానిక తెలుగు సంస్థలైన తెలుగు కళా సమితి, ఎన్.జే.టి.ఎ, కళావేదిక, ఎస్.పి.బిల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్‌కు హాజరై.. ఏడో అమెరికా తెలుగు సంబరాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభకు  మనోజ్ ఇరువూరి, కవిత తోటకూర వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. కృష్ణ అనుమోలు,  ప్రసాద్ సింహాద్రి వీడియో, ఆడియో సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ్ రెస్టారెంట్ వారు అందించిన విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని