TDP-Janasena-BJP: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీయే కూటమి విజయోత్సవ సభ

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై అమెరికాలో తెదేపా, జనసేన, భాజపా ఎన్‌ఆర్‌ఐ విభాగాల నేతలు విజయోత్సవాలు నిర్వహించారు.

Updated : 17 Jun 2024 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై అమెరికాలో తెదేపా, జనసేన, భాజపా ఎన్‌ఆర్‌ఐ విభాగాల నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. సీఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో నార్త్‌ కరోలినాలోని ఛార్లెట్‌లో సంబరాలు చేసుకున్నారు. 125 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మేనర్‌ ఫామ్‌హౌస్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు.  

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌ఆర్‌ఐ నేతలను పలువురు అభినందించారు. గుంటూరు ఎంపీ డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఉదయగిరి ఎమ్మెల్యే సురేశ్‌ కాకర్ల, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాధించిన విజయాన్ని గుర్తుచేసుకున్నారు. స్వస్థలానికి వెళ్లి రాష్ట్రానికి సేవ చేస్తున్నందునకు వారికి అభినందనలు తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఛార్లెట్‌ తదితర ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లిన ఎన్‌ఆర్‌ఐలు తమ ప్రచార అనుభవాలను పంచుకున్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జూమ్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తమ గెలుపునకు ఎన్‌ఆర్‌ఐలు చేసిన కృషిని మరువలేమని.. సహకారాన్ని ఇదే విధంగా కొనసాగించి ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. జూమ్‌ మీటింగ్‌లో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే సురేశ్‌ కాకర్ల, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేత జయరాం కోమటి తదితరులు మాట్లాడారు. అంతకు ముందు రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఛార్లెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెదేపా, జనసేన, భాజపా ఎన్‌ఆర్‌ఐ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు