
ట్రంప్ పోటీచేస్తే మద్దతిస్తా..!
2024 అధ్యక్ష రేసుపై రిపబ్లికన్ నేత నిక్కీహేలీ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత.. తదుపరి అధ్యక్ష ఎన్నికలపై రిపబ్లికన్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. 2024లో జరిగే అధ్యక్ష పోరులో రిపబ్లికన్ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే విషయం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తిరిగి డొనాల్డ్ ట్రంప్ పోటీచేస్తే.. తాను మద్దతు ఇస్తానని రిపబ్లికన్ సీనియర్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు.
‘ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉంటే నేను పోటీనుంచి తప్పుకుంటాను. అంతేకాకుండా ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తాను’ అని నిక్కీ హేలీ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే తాను ప్రచారాన్ని మొదలుపెట్టనని స్పష్టం చేశారు. అధ్యక్ష బరిలో పోటీ చేస్తానంటే ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై ఏదో సమయంలో ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత అధ్యక్ష పదవికి పోటీపడుతున్నవారి జాబితాలో నిక్కీ హేలీ ముందువరుసలో ఉన్నారు. దక్షిణ కరోలినా రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ఆమె ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా విధులు నిర్వర్తించారు. అటు పార్టీలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉండడంతో గత అధ్యక్ష ఎన్నికల్లోనే బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత.. 2024లో నిక్కీ హేలీనే రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పోటీ చేస్తే తప్పుకునేందుకు నిక్కీ హేలీ సిద్ధమయ్యింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు నిక్కీ హేలీకి అధ్యక్ష కార్యాలయంతో సత్సంబంధాలు ఉండేవి. కానీ 2018లో ఆమె అధ్యక్ష కార్యాలయం నుంచి బాధ్యతలు విరమించాక పలుసార్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టడం వల్లే క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిందని వచ్చిన వార్తల సందర్భంగానూ ఆయనను విమర్శించారు. అయితే చివరకు ట్రంప్‌కే మద్దతు తెలియజేయడం విశేషం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.