
బైడెన్.. హారిస్ తొలి ట్వీట్లు ఇవే..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ఉషోదయం ప్రారంభమైంది. డెమొక్రాటిక్ నేతలు జో బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ వేడుక జరిగింది. కాగా.. అధ్యక్షుడి హోదాలో బైడెన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘సమయాన్ని వృథాకానివ్వను ’’ అంటూ తొలి ట్వీట్ చేశారు. అటు ప్రమాణస్వీకారం అనంతరం కమలాహారిస్ కూడా ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు.
బుధవారం ఉదయమే అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUSను ట్విటర్ సంస్థ బైడెన్ యంత్రాంగానికి అప్పగించింది. ప్రమాణస్వీకారం తర్వాత బైడెన్ ఈ ఖాతా నుంచి తొలి ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కరించాలంటే సమయాన్ని వృథా చేయకూడదు. అందుకే ఈ రోజే నేను ఓవల్ ఆఫీస్కు వెళ్లి పని ప్రారంభిస్తున్నాను. అమెరికా కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాను’’ అని బైడెన్ ట్విటర్లో పేర్కొన్నారు.
అటు ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన కమలా హారిస్ కూడా తన అధికారిక వైస్ ప్రెసిడెంట్ ఖాతా నుంచి తొలి ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఉపాధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్న హారిస్ అందుకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ వెలుపల ఏర్పాటు చేసిన వేదికపై 78ఏళ్ల బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా 56ఏళ్ల కమలా హారిస్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ‘క్యాపిటల్’ దాడుల నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వేడుక జరిగింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. బిల్ క్లింటన్ సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం అనంతరం బైడెన్ ప్రసంగిస్తూ.. అందరి అధ్యక్షునిగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.