ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి.. న్యూజెర్సీలో ఘనంగా శత జయంతి వేడుకలు

శతాబ్ది గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జ‌యంతి వేడుక‌లు అమెరికాలో ఘనంగా జరిగాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో స్థానిక రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Published : 06 Dec 2022 21:07 IST

న్యూజెర్సీ: శతాబ్ది గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జ‌యంతి వేడుక‌లు అమెరికాలో ఘనంగా జరిగాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో స్థానిక రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్‌(GSKI) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు అన్నా మధుసూదన్‌ రావు అధ్యక్షత వహించారు. వేదమంత్రోచ్ఛారణతో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రార్థనా గీతాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రవాసీయులను ఆద్యంతం అలరించింది. ఘంటసాల స‌తీమ‌ణి సావిత్రి భార‌త్ నుంచి పంపిన వీడియో సందేశం ఆ మ‌హా గాయ‌కుడి పాట‌ల‌ జ్ఞాపకాలను అందరి మనుసుల్లోనూ నింపింది.  ఘంటసాల కుమార్తె సుగుణ, ఆయన కోడలు కృష్ణకుమారి ఈ శత జయంతి వేడుకలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ తమ సందేశాలు పంపారు. ప్రపంచంలోనే అత్యధిక సంస్మరణ సభలు జరిగిన గాయకుడిగా ఘంటసాల చరిత్ర సృష్టించారని.. అలాంటి గొప్ప శతాబ్ది గాయకుడికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కృష్ణకుమారి అభ్యర్థించారు. అనంతరం ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ సభ్యుల సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం పంపించారు. 

ఘంటసాల ఆలపించిన 101 భగవద్గీత శ్లోకాలను 20మంది జీఎస్‌కేఐ సభ్యులు శ్రద్ధగా ఆలపించి శతాబ్దిగాయకుడికి ఘనంగా నివాళి అర్పించారు. ఇలాంటి పఠనం ప్రపంచంలోనే తొలిసారి జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. శతజయంతి సందర్భంగా  జీఎస్‌కేఐ సభ్యులు ఘంటసాల సంగీత దర్శకత్వం, గానంతో సమకూర్చిన 100 పాటల పల్లవులను శతగీత విభావరిగా పాడి ప్రేక్షకులను మైమరిపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన రహస్యం సినిమాలోని గిరిజా కల్యాణం కూచిపూడి యక్షగానాన్ని చిన్మయి నృత్యాలయ న్యూజెర్సీ వారు శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర ఆధ్వర్యంలో ప్రదర్శించి ఆహూతులను  మంత్రముగ్ధుల్ని చేశారు. ఘంటసాల పాటలను ప్రముఖ సినీ గాయకుడు ఆదిత్య అయ్యంగార్ గానం చేసి శ్రోతలకు వీనులవిందు చేశారు. 

ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మద్దుల సూర్యనారాయణ, గంటి భాస్కర్, ఇతర ప్రముఖులు GSKI చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఘంటసాల శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధుసూదనరావు, ఇతర ట్రస్టీలు పుష్పకుమారి, రవితేజ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం..’ అనే నినాదంతో ముందుకు సాగుతూ తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా వ్యాపింపచేయడమే త‌మ లక్ష్యమన్నారు. తెలుగు భాష ఆచంద్రతారార్కం ప్రకాశించేలా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు. ముసుకు మహేంద్ర రెడ్డి,  వెంపరాల సుజాత, తాడేపల్లి రేణు, టీపీ శ్రీనివాసరావు, కనకమేడల శివశంకరరావు, ఆళ్ళ రామిరెడ్డి, గూడూరు ప్రవీణ్, మాడిశెట్టి రంగారావు, సన్నిధి సుబ్బారావు, తడికమళ్ళ ప్రవీణ్, గూడూరు శ్రీనివాస్, చెరువు విద్యాసాగర్, గిడుగు సోమశేఖర్.. తదితరులు ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేశారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు