కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు

ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ నిర్వహించిన శకపురుషుడు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Published : 14 May 2023 17:06 IST

కువైట్‌: ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, గల్ఫ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు రావి రాధా కృష్ణ, సభ్యులు వెంకట్‌ కోడూరి, ప్రధాన కార్యదర్శి మల్లి మరొతు పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావి వెంకటేశ్వర్ రావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తెదేపా కడప నియోజకవర్గం ఇంఛార్జి అమీర్ బాబు, గౌరవ అతిథులు తెదేపా బద్వేల్ నియోజకవర్గం ఇంఛార్జి కొండ్రెడ్డి రితేష్ రెడ్డి, తెదేపా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్‌ రాజు, తెలుగుదేశం పార్టీ మదనపల్లె నియోజకవర్గం నాయకులు రామినేని జయరాం నాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు టి.నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ అన్నీ గవర్నరేట్ల కోఆర్డినేటర్స్‌, జాయింట్‌ కో ఆర్డినేటర్స్‌, వివిధ విభాగాలు, మహిళా విభాగాలు, వారి కమిటీలు, పలువురు రాజకీయ నేతలు, తెలుగు సంఘాలు విచ్చేసి సభను విజయవంతం చేశాయి.

దివంగత నేత ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆవిర్భవించినప్పటికీ.. ‘మహానాడు’ పేరుతో పార్టీ పండుగ చేసుకునేది మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న అని వక్తలు తెలిపారు. పార్టీ శ్రేణులకు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టిన రోజే ఈ మహానాడు అని అదే తమకు అసలైన పండుగ అని చెప్పారు. రాజకీయ చైతన్యం కలిగిన ఇంకో తరం ఎన్టీఆర్ రాజకీయ సంచలనాలు, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఆయన పరిరక్షించిన తీరు గురించి మాట్లాడుతుందన్నారు. తెలుగునాట ప్రతి ఇంటా నిత్యం ఏదో ఒక రూపేణా వినిపించే పేరు ఎన్టీఆర్ అన్నారు. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ల రాజకీయ కురువృద్ధుల నుంచి 30ఏళ్ల యువనేత వరకు పలవరించే మాట ‘అన్నగారు’ అని తెలిపారు. అన్ని తరాలకు ఆయన అన్నగారే అని అన్నారు. ఎవరైనా జీవితంలో ఏదో ఒక రంగంలో విజయవంతమవుతారు.. కానీ, ఎన్టీఆర్ 33ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారన్నారు. మరెన్నో ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వెండితెర వేలుపుగా పూజలు అందుకున్నారన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా కీర్తించబడ్డారని కొనియాడారు.

తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి ఆరుపదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈ రంగంలోనూ అనితరసాధ్యమైన విజయాలను అందుకున్నారని ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారన్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారని పేర్కొన్నారు. మహిళలకు హక్కులు పంచి.. పేదలకు సంక్షేమం అందించారన్నారు. తెలుగువారి చరిత్ర చెప్పుకొన్నంత కాలం తన గురించి చెప్పుకొనేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ‘శక పురుషుడు’ ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహానాడుకు రుచికరమైన వంటకాలు అందించిన వై.కోట గ్రామస్థులకు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వారికి ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని