NRI: ఏపీలో కూటమి విజయం.. కాలిఫోర్నియాలో మిన్నంటిన సంబరాలు

ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

Published : 17 Jun 2024 20:28 IST

వాషింగ్టన్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ఘనవిజయం సాధించి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించడంపై విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని బే ఏరియాకు చెందిన అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు కాలిఫోర్నియాలో ఆదివారం సంబరాలు చేసుకున్నారు. ఫ్రీమోంట్ నగరంలోని సెంట్రల్ పార్క్ ఈ సంబరాలకు వేదికైంది.

ఎన్నారై తెదేపా అధ్యక్షులు కోమటి జయరాం పర్యవేక్షణలో పార్టీ నేత కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. 900కు పైగా ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ బంగారు భవిష్యత్తును చంద్రబాబు తీర్చిదిద్దగలరని ఆకాంక్షించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత హాప్కిన్స్ స్కూల్ నుంచి 250కి పైగా కార్లతో ర్యాలీగా సమావేశ స్థలానికి చేరుకున్నారు. కూటమి అభిమానులు 4 గంటలకు పైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ నిబద్ధత, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం ఏపీ భవిష్యత్తుకు ఎంతో అవసరమని నినదించారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా శాసనసభ్యులు సుజనా చౌదరి, జనసేన శాసనసభ్యురాలు లోకం మాధవి ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ‘‘ఏపీలో విధ్వంసకరమైన ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించడంలో తెదేపా ఎన్నారై విభాగం కీలకపాత్ర పోషించడం హర్షణీయం. ఈ విజయం అందరిది. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే చంద్రబాబుకి ముఖ్యం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలి’’ అని కోమటి జయరాం పిలుపునిచ్చారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఈ విజయాన్ని ఇచ్చిన తెదేపా, జనసేన, భాజపా నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకం, ఎన్నారైలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని పెమ్మసాని చంద్రశేఖర్, సుజనా చౌదరి పేర్కొన్నారు.

‘‘అవినీతి పాలనను అంతమొందించడానికి నారా లోకేష్ చేసిన యువగళం యాత్ర యువతకి స్ఫూర్తిదాయకం. ఘన విజయం సాధించేందుకు నేతలు శ్రమించారు’’ అని వెంకట్ కోగంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ తాడపనేని, గాంధీ పాపినేని, జగదీశ్‌ గింజుపల్లి, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ ఆసూరి, రమేష్ కొండా, బాబు ప్రత్తిపాటి సమన్వయపరచగా, హరి బొప్పూడి, నరహరి, అశోక్ మైనేని, విష్ణు బూరుగుపల్లి, రాజా కొల్లి, తిరు కాకరాల, అనిల్ అరిగే, నవీన్ కొండపల్లి , ప్రసాద్ మంగిన, సీతారాం కొడాలి తదితరులు సమర్ధవంతంగా నిర్వహించారు.

చంద్ర గుంటుపల్లి, వెంకట్ జెట్టి, అడుసుమల్లి వెంకట్, శ్రీనివాస్ వీరమాచినేని, రవికిరణ్ ఆలేటి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, దివ్య, సునిత రాయపునేని, శిరీష నెక్కలపూడి, శైలజ వెల్లంకి, శ్రావ్య పిన్నమనేని, సిరియాలు, ప్రభ మల్లారపు, ప్రత్యూష, రూప, రుద్రాణి, లోకేష్, ముచ్చెర్ల గోపి, మురళి గొడవర్తి, రాందాస్, అనంత్, మురళి, నవీన్ కొడాలి, కృష్ణ కోగంటి, రాం భైరపునేని, శివ, హర్ష యడ్లపాటి, కృష్ణమోహన్ మట్టపర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని