UPI Payments: ఎన్‌ఆర్‌ఐలకూ యూపీఐ సదుపాయం.. తొలుత ఈ 10 దేశాల వారికే ఛాన్స్‌!

ఎన్‌ఆర్‌ఈ (NRE)/ఎన్‌ఆర్‌వో(NRO) ఖాతాలున్న ఎన్‌ఆర్‌ఐలు త్వరలో తమ అంతర్జాతీయ మొబైల్‌ నంబర్ల ద్వారా యూపీఐ ( UPI) సేవలను ఉపయోగించుకోవచ్చని ఎన్‌పీసీఐ (NPCI) తెలిపింది.

Updated : 11 Jan 2023 22:34 IST

దిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులకు సైతం  యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు  భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (NPCI) ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో 10 దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు యూపీఐ  లావాదేవీలు నిర్వహించే  సంస్థలు ఏప్రిల్‌30 నాటికి ఎన్‌ఆర్‌ఐలకు సేవలందించేందుకు అనువైన సాంకేతికతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎన్‌ఆర్‌ఈ (NRE)/ఎన్‌ఆర్‌వో(NRO) ఖాతాలున్న ఎన్‌ఆర్‌ఐలు తమ అంతర్జాతీయ మొబైల్‌ నంబర్ల ద్వారా యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. తొలుత సింగపూర్‌, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్‌, ఒమన్‌, ఖతార్‌, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, బ్రిటన్‌ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

‘‘విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతాల నుంచి తాము ఉంటున్న దేశాల్లోని ఫోన్ నంబర్‌ నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయొచ్చు. ప్రస్తుతం పది దేశాల్లో ఈ సేవలు అందబాటులోకి తెస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు వచ్చిన సందర్భంలో నగదు చెల్లింపులు/బదిలీకి యూపీఐ సేవలు వినియోగించుకోవచ్చు’’ అని పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ విశ్వాస్‌ పటేల్‌ తెలిపారు. యూపీఐలోని సిమ్‌ బైండింగ్ భద్రతా ఫీచర్‌ కారణంగా భారతీయ నెట్‌వర్క్‌ సిమ్‌కార్డులు ఉపయోగించని ఫోన్‌ నంబర్లతో యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యపడేదికాదు. త్వరలో యూపీఐ నిర్వహణ సంస్థలు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత ఎన్‌ఆర్‌ఐలు తమ అంతర్జాతీయ ఫోన్‌ నంబర్లకు ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో నంబర్లు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు